
దళపతి విజయ్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆయనపై కేసు నమోదైంది. డ్రగ్స్, ఆల్కహాల్, టోబాకో వంటి హానికర పదార్ధాలను వాడినందుకుగానూ విజయ్‌పై కేసు నమోదు చేశారు. ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ ఆర్‌టీఐ సెల్వం అనే కార్యకర్త విజయ్‌కి వ్యతిరేకంగా, `లియో` సినిమా టీమ్‌కి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల `లియో` సినిమా నుంచి `నా రెడీ` అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.
ఇందులో విజయ్ సిగరేట్ తాగుతున్నట్టుగా, డ్రగ్స్ వాడకాన్ని ప్రేరేపించేలా సీన్లు ఉన్న నేపథ్యంలో ఇది సమాజానికి హానికరం అని చెబుతూ, అందుకు ప్రోత్సహించిన విజయ్, `లియో` టీమ్‌లపై ఆర్‌టీఐ సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్కోటిక్ కంట్రోల్ యాక్ట్(ఎన్సీఏ) ప్రకారం విజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. `నా రెడీ` పాటలో డ్రగ్స్, ఆల్కహాల్, టోబాకోలు ఉపయోగించినందుకుగానూ సెల్వం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు పోలీసుల నుంచి అందుతున్న సమాచారం.
దీంతో విజయ్, `లియో` టీమ్ చిక్కుల్లో పడ్డట్టయ్యింది. ఇదిలా ఉంటే దీనిపై విజయ్ ఫ్యాన్స్ స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. పాటలో వాటిని సన్నివేశం డిమాండ్ మేరకు చూపించారని, అది తప్పుకాదంటున్నారు. పైగా అందులో డ్రగ్స్ ని, ఆల్కహాల్‌ని యానిమేషన్ విజువల్స్ లోనే చూపించారు. అదెలా తప్పు అవుతుందంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వివాదంగా మారుతుంది. మరి దీనిపై `లియో` టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
విజయ్ హీరోగా త్రిష కథానాయికగా నటిస్తున్న చిత్రం `లియో`. `విక్రమ్` ఫేమ్ లోకేష్ కనగరాజ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా జూన్ 22న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోపాటు `నా రెడీ` అనే పాటని విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందించారు. ఆ పాట ఛార్ట్ బస్టర్ గా నిలిచింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
దాదాపు ముప్పై మిలియన్స్ కి పైగా వ్యూస్‌ని రాబట్టుకుంది. ఫ్యాన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ వైపు పాట పాపులర్ అయిన నేపథ్యంలో ఇప్పుడు దీనిపై కేసు నమోదు కావడం టీమ్‌ని ఆందోళనకి గురి చేస్తుంది. మరి ఇదిలా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. ఇక చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తుంది. `విక్రమ్` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.