
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో వివాదానికి కారణమైన నటి కల్పికా గణేష్‌పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మే 29న ఈ సంఘటన చోటు చేసుకున్నప్పటికీ, ప్రిస్మ్ క్లబ్ అండ్ కిచెన్ మేనేజింగ్ పార్ట్‌నర్ దీపక్ బజాజ్ జూన్ 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లోసెక్షన్ 324(4), 352 (జన సమూహాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో దూషణ), 351 (క్రిమినల్ బెదిరింపులు) కింద ఆమెపై కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న మేరకు, నటి కల్పికా గణేష్ ఓ వ్యక్తితో కలిసి ఆ పబ్‌కి వచ్చి సుమారు రూ. 2,200 విలువైన ఫుడ్, బేవరేజ్‌లు తీసుకున్నారు. అనంతరం “చీజ్‌కేక్” అనే డెజర్ట్‌ను ఉచితంగా ఇవ్వాలంటూ స్టాఫ్‌ను బలవంతపెట్టారు. స్టాఫ్ తరఫున గుడ్‌విల్ గెస్టర్‌గా బ్రౌనీ ఇచ్చినా ఆమె తిరస్కరించారు. అనంతరం డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్‌లపై అసభ్య వ్యాఖ్యాలతో రెచ్చిపోతూ శారీరకంగా కూడా దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఈ దురుసు ప్రవర్తనలో భాగంగా ఆమె బ్రౌనీ ప్లేట్‌ను విసిరేసి ఆస్తి నష్టం కలిగించారని, అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వెళ్లి అనుచిత ఆరోపణలు చేశారని జనరల్ మేనేజర్ పోలీసులకు తెలిపారు. ఆమె తప్పుడు మొలెస్టేషన్ ఆరోపణలు సోషల్ మీడియాలో పెట్టారని తెలిపారు.
పబ్ బ్రాండ్, స్టాఫ్ పరువు నష్టం చెందినట్లు మేనేజ్‌మెంట్ పేర్కొంది. కేసును ఆలస్యం చేసినప్పటికీ, ఆమె ప్రవర్తన కొనసాగుతుండటంతో దాన్ని నివారించేందుకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదైంది కాబట్టి కల్పిక గణేష్ చిక్కుల్లో పడ్డట్లే. మరి ఈ వివాదంపై కల్పిక పోలీసులకు ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.
కల్పికా గణేష్ వివాదంలో చిక్కుకున్న ఈ తరుణంలో ఆమె గురించి మరో రూమర్ కూడా వైరల్ గా మారింది. అదేంటంటే.. కల్పిక గణేష్ త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆమె ఎంపిక ప్రక్రియ ముగిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో బిగ్ బాస్ షో నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన వెలువడ్డాక తేలనుంది.
కల్పికా గణేష్ తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, హిట్ ది ఫస్ట్ కేస్, యశోద లాంటి చిత్రాల్లో నటించింది.