తానేంటో మరోసారి రుజువు చేసుకున్న పవన్ కళ్యాణ్

By Sambi ReddyFirst Published Sep 20, 2022, 10:00 AM IST
Highlights


పవన్ ఫ్యాన్స్ పూర్తి నిరాశలో ఉన్నారు. పైకి ఆయన నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నా... లోలోపల మదనపడుతున్నారు. ఆయనపై ఉన్న ఆ నెగిటివ్ ట్యాగ్ మరింత బలపడేలా పవన్ ప్రవర్తిస్తున్నాడని ఆవేదన చెందుతున్నారు.
 

పవన్ కళ్యాణ్ ది నిలకడలేని స్వభావం. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు, చర్యలు సమయానుకూలంగా మారిపోతాయి. పవన్ పై ప్రత్యర్ధులు చేసే ప్రధాన ఆరోపణ ఇది. అందులో నిజం లేకపోలేదు. రాజకీయాల్లోకి వచ్చాక పవన్ పలుమార్లు మాట మార్చారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇకపై సినిమాలు చేయను ఈ జీవితం ప్రజాసేవకే అంకితం అన్నారు. కట్ చేస్తే ఫలితాల తర్వాత కమ్ బ్యాక్ ప్రకటించారు. 2014 నుండి 2018 వరకు చంద్రబాబు, మోడీ భేష్ అన్నారు. తర్వాత వారిద్దరినీ తిట్టిపోశారు. మోడీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాగా... గొప్ప లీడర్ అంటూ బీజేపీతో మిత్రుత్వం పెట్టుకున్నాడు. 

ఇక 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీతో పొత్తు ఉండొచ్చన్న హింట్ ఇస్తున్నాడు. వైసీపీ వర్గాలు పవన్ పొత్తు పెట్టుకునేది ఖాయమేనని డిసైడై పోయాయి. క్యాపిటల్ అమరావతి విషయంలో కూడా పవన్ రెండు నాల్కల ధోరణి అవలంభించాడు. టీడీపీతో పొత్తులో ఉన్నంతకాలం అమరావతిని రాజధానిగా  సమర్ధించాడు. 2019 ఎన్నికలకు ముందు దోస్తీ కటీఫ్ చేసుకున్న పవన్ అమరావతిని ఒక ఎక్స్క్లూజివ్ కాపిటల్ గా అభివర్ణించాడు. అది ఒక వర్గానికి మాత్రమే చెందినది, ఇతరులకు సామాన్యులకు అక్కడ చోటు లేదన్నాడు. అభివృద్ధి ఒకే చోట జరగడం ప్రమాదం అన్నాడు. 

వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చాక అమరావతి రాగం అందుకున్నాడు. ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ది నిలకడలేని మనస్థత్వం అని చెప్పాడని ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. తాజాగా ఆయన బస్సు యాత్ర వాయిదా పెద్ద బూమరాంగ్ అయ్యింది. సొంత పార్టీ నేతలే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ బస్సు యాత్రతో జనసేనకు భారీ మైలేజ్ వస్తుందని భావించిన వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లారు. 

అంతకు మించి నిలకడ లేని మనిషని నిరూపించుకున్నారని బాధపడుతున్నారు. ప్రజాసమస్యల పై మరింత అవగాహన కోసమే వాయిదా అని పవన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. బస్సు యాత్ర ప్రకటించి రెండు నెలలు దాటిపోగా పవన్ ప్రజా సమస్యల గురించి అధ్యయనం చేయకుండా ఏం చేస్తున్నారని వాపోతున్నారు. అలాంటప్పుడు నాలెడ్జ్ వచ్చాకే ప్రకటించాల్సింది. అధికారిక ప్రకటనల తర్వాత వాయిదాలు పార్టీ ఇమేజ్ దెబ్బతీస్తున్నాయనేది వారి వాదన. 

సోషల్ మీడియా కామెంట్స్ చూశాక, జనసేన శ్రేణులు బస్సు యాత్ర వాయిదా వార్తతో నిస్పృహలో కూరుకుపోయాయనిపిస్తుంది. వాయిదా నిర్ణయం సరైందని కాదని అభిప్రాయపడుతున్నాయి. ఇంత బాధలో వాళ్లకు ఓ ఓదార్పు ఉంది. పవన్ యాత్రకు కేటాయించిన సమయాన్ని ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్ పూర్తి చేయడానికి కేటాయిస్తున్నాడని సమాచారం. అదే జరిగితే పవన్ పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లుతో పాటు వినోదయ సిత్తం రీమేక్, హరీష్ శంకర్ మూవీ పూర్తయ్యే అవకాశం కలదు. 

click me!