
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మేగా మేనల్లుడు సాయితేజ్ కలిసి నటిస్తున్న చిత్రం `బ్రో`(ది అవతార్). సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ప్రమోషన్ కార్యక్రమాల జోరుపెంచారు. ఇప్పటికే టీజర్‌ని విడుదల చేయగా, అది ఫ్యాన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంది. పవన్ ఎంట్రీ, డైలాగ్‌లు వాహ్ అనేలా ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. `బ్రో` తొలి పాటని విడుదల చేశారు. `మై డియర్ మార్కండేయ మంచి మాట చెబుతా రాసుకో.. `అంటూ సాగే పాటని శనివారం సాయంత్రం విడుదల చేశారు.
పార్టీ సాంగ్‌లా, కలర్‌ఫుల్‌గా సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అంతేకాదు దమ్ములేపుతుంది. ఇందులో సాయితేజ్‌తోపాటు పవన్ కళ్యాణ్ కూడా కనిపించడం విశేషం. `బ్రో` టైటిల్ సాంగ్ గా దీన్ని డిజైన్ చేసినట్టు ఉంది. ముందుగా.. లిరిక్‌ని సాయితేజ్ ప్రారంభిస్తూ డాన్సులు చేయగా, ఆ తర్వాత పవన్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ని దేవుడిగా భావిస్తూ, స్టేజ్‌పైకి ఆహ్వానిస్తూ సాయితేజ్ దెండం పెట్టాడు. ఇక పవన్.. `మైడియర్ మార్కండెయ మంచి మాట చెబుతా రాసుకో` అని సాయితేజ్‌కి హిత బోధ చేసినట్టుగా ఈ పాట సాగుతుండటం విశేషం. వందల మంది డాన్సర్ల మధ్య ఊపుతెచ్చేలా ఈ సాంగ్ సాగింది. ఉర్రూతలూగించేలా ఉంది.
పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఈ పాటలో అంతర్లీనంగా మంచి సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నారని అనిపిస్తుంది. ఇందులో పవన్ బ్లాక్ టీషర్ట్, జీన్స్‌లో ఉన్నారు. మెడలో తాయత్తు బిల్ల ఉంది. ఆయన లుక్ కొత్తగా, స్టయిలీష్‌గా ఉంది. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటని రేవంత్, సిగ్దాశర్మ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి రాశారు. థమన్ సంగీతం అందించారు.
ఇక `బ్రో` చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగులు అందించారు. సముద్రఖని దర్శకత్వం చేశారు. తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని నిర్మిస్తుంది. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతికశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జులై 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందులో భాగంగా ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచింది టీమ్.