బ్రహ్మానందాన్ని సత్కరించిన చిరంజీవి, రామ్‌చరణ్‌..

By Aithagoni RajuFirst Published Mar 23, 2023, 5:41 PM IST
Highlights

`రంగమార్తాండ` చిత్రంలో కీలక పాత్రలో నటించిన హాస్య నటుడు బ్రహ్మానందానికి విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. ఈనేపథ్యంలో ఆయన్ని చిరు, చరణ్‌ సత్కరించారు.

హాస్యనటుడు బ్రహ్మానందం నవ్వుల రారాజుగా వెలిగారు. వెలుగొందుతున్నారు. అత్యధిక సినిమాలు చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కారు. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన ఫస్ట్ టైమ్‌ తన రూట్‌ మార్చారు. కమెడియన్‌గా కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు. `రంగమార్తాండ` చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ప్రధాన పాత్ర అయిన రంగమార్తాండగా నటించిన ప్రకాష్‌ రాజ్‌కి ఫ్రెండ్‌గా సుబ్బు పాత్రలో నటించారు. 

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన `రంగమార్తాండ` చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులో సుబ్బు పాత్రలో బ్రహ్మానందం కాసేపు నవ్విస్తే, అంతకు మించి ఏడిపించారు. సినిమాలో హైలైట్‌గా నిలిచారు. రంగస్థలం నటుడిగా ఆయన సంస్కృతంలోని పద్యాలను అలవోగా పలికించి వాహ్‌ అనిపించారు. ఇక తన భార్య ఆనారోగ్యానికి గురైనప్పుడు, ఆమె చనిపోయినప్పుడు బ్రహ్మానందం నటన పీక్‌లో ఉంటుంది. హృదయాన్ని కదిలిస్తుంది. ఇక ఒంటరిగా ఉండి మనో వేదన అనుభవిస్తూ ఆయన ఆసుపత్రి పాలైనప్పుడు బ్రహ్మీ నటన ఫిదా చేస్తుంది. 

ఒంటరిగా ఉండలేకపోతున్నారా.. నాకు చావునిస్తావా అని స్నేహితుడు రంగమార్తాండని కోరినప్పుడు, ఆ సన్నివేశాలకు కన్నీరుపెట్టుకోని ఆడియెన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇన్నేళ్లపాటు ఎంతగా నవ్వించారో, ఒక్క సినిమాకే, కొన్ని సీన్లతోనే అంతగా ఏడిపించారు బ్రహ్మానందం. అందుకే సినిమాలో మిగిలిన పాత్రలకంటే బ్రహ్మీ పాత్రనే హైలైట్‌గా నిలిచింది. సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఈసినిమాకి మంచి స్పందన దక్కుతున్న నేపథ్యంలో ఆయన్ని చిత్ర పరిశ్రమ సత్కరించింది. 

మెగాస్టార్‌ చిరంజీవి, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సైతం ప్రత్యేకంగా సత్కరించారు. బ్రహ్మానందం నటించిన పాత్రకు ఇంత మంచి పేరు రావడంతో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. బ్రహ్మానందం గారికి శాలువాతో సత్కరించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. మరోవైపు ఫిల్మ్ నగర్‌ కల్చరల్‌ సొసైటీ తరఫున బ్రహ్మానందాన్ని ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు, సినీ దిగ్గజాలు పాల్గొన్నారు. మంత్రి తలసానితోపాటు, దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా ఇందులో పాల్గొనడం విశేషం.
 

click me!