
టాలీవుడ్‌లో మరో కొత్త కాంబినేషన్ సెట్ అయ్యింది. మాస్, యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Sreenu), ఎనర్జిటిక్ స్టార్ రామ్‌పోతినేని(Ram Pothineni) కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా శుక్రవారం సాయంత్రం చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. గత కొంత కాలంగా వీరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని పుకార్లు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొట్టాయి. తాజాగా వాటిని కన్పమ్ చేస్తూ యూనిట్ బోయపాటి-రామ్(BoyapatiRapo) కాంబో సినిమాని ప్రకటించింది.
ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా రూపొందించబోతుండటం విశేషం. ఓ రకంగా ఇది ఇటు రామ్‌పోతినేనికి, అటు దర్శకుడు బోయపాటికి ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా చెప్పొచ్చు. ప్రస్తుతం రామ్ `ది వారియర్` పేరుతో తెలుగు, తమిళం బైలింగ్వల్ చిత్రంలో నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకుడు. అనంతరం ఈ చిత్రం తెరపైకి రాబోతుంది.
ఇక దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవల బాలయ్యతో `అఖండ` చిత్రం చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఏకంగా 130కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. ఊహించని విజయంతో ఫెయిల్యూర్‌లో ఉన్న బాలయ్యకి, బోయపాటికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇక `బోయపాటిరాపో` కాంబోలో సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్‌గా ఉంటుందని, అయితే ఈ సారి బోయపాటి ప్రయోగం చేయబోతున్నారని సమాచారం. మరి ఇది ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం.
బోయపాటి శ్రీను.. రామ్‌చిత్రం తర్వాత బన్నీతో సినిమా చేసే కమిట్‌మెంట్ ఉందని సమాచారం. మరోవైపు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న `ది వారియర్`చిత్రంలో యంగ్ సెన్సేషనల్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. అదిపినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాని కూడా శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఈ ఏడాది తెరపైకి రాబోతుంది.