
మగధీర తర్వాత రిలీజైన ఆరెంజ్ చిత్రం ఆ స్థాయి అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికలబడింది. యువతకి ఈ చిత్రం నచినప్పటికీ మ్యాజిక్ చేయడంలో విఫలం అయింది. ఫలితంగా నిర్మాత నాగబాబు ఈ చిత్రంతో దారుణంగా నష్టపోయారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.
అయితే రాను రాను ఆరెంజ్ చిత్రం కొత్త జనరేషన్ యువతకి బాగా ఎక్కేసింది. ఒక కల్ట్ క్లాసిక్ మూవీగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల రాంచరణ్ బర్త్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. థియేటర్స్ లో ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. మెగా బ్రదర్ నాగబాబు సైతం.. ఈ చిత్రాన్ని తాము ఒక జనరేషన్ ముందుగానే తీసాం అని చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ చిత్రంలో రాంచరణ్ స్టైల్, పాటలని ఫ్యాన్స్ చాలాబాగా ఎంజాయ్ చేశారు. రీరిలీజ్ అయిన అన్ని చోట్ల ఆరెంజ్ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 2010లో తొలిసారి ఈ చిత్రం విడుదలైనప్పుడు చిత్ర యూనిట్ కి నిరాశని కలిగిస్తే.. ఇప్పుడు అందరి కళ్ళలో ఆనందం నింపుతోంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఆరెంజ్ రీ రిలీజ్ రెస్పాన్స్ చూసి ఎమోషనల్ అయ్యారు.
అభిమానులు కృతజ్ఞతలు చెబుతూ వీడియో సందేశం రిలీజ్ చేశారు. 'ఆరెంజ్ రీరిలీజ్ లో ఎంత మంచి రెస్పాన్స్ రావడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ముందుగా ఫ్యాన్స్ అందరికి కృతజ్ఞతలు. రాంచరణ్ గారితో షూటింగ్ క్షణాలని ఎప్పటికి మరచిపోలేను. నాగబాబు గారికి, మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జైరాజ్ గారికి అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఎక్కడో అన్ని డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ చిత్రం ముందుగా రిలీజ్ అయినప్పుడు రిజల్ట్ తో సంబంధం లేకుండా నా పక్కన నిలబడింది పవన్ కళ్యాణ్ ఒక్కరే.
నన్ను ఆయన ఇంటికి పిలిచారు. సక్సెస్, ఫెయిల్యూర్ పక్కన పెట్టేయ్ భాస్కర్... నువ్వు ఎప్పటికీ మంచి రచయిత, దర్శకుడివే అని ప్రోత్సాహించారు. ఆయన కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకి పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నా అని భాస్కర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆరెంజ్ రీరిలీజ్ లో వచ్చిన కలెక్షన్స్ ని జనసేన పార్టీకి ఫండ్ గా ఇస్తానని నాగబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.