
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహా రెడ్డి' షూటింగులో.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగులో ఆయన జాయిన్ అయ్యారు.
తాజాగా బిగ్ బి తన స్నేహితుడు చిరంజీవి గురించి తెలుగులో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'సూపర్ స్టార్ చిరంజీవి, అదే ఫ్రేమ్ లో ఒక గౌరవం ఉండాలి' అని పేర్కొంటూ అంటూ బిగ్ బి 'సైరా' చిత్రానికి సంబంధించిన తన లుక్ ఎలా ఉండబోతోందో వివరిస్తూ ఓ ఫోటో విడుదల చేశారు. ఈ చిత్రంలో అమితాబ్, చిరంజీవి గురు శిష్యులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైరా' చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తవ్వగా... ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సైరాలో కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతిబాబు, అమితాబ్ లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు.
'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ నయనతార నటిస్తోంది. తాజాగా జరుగుతున్న షెడ్యూల్‌లో నయనతార కూడా జాయిన్ అయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రూ. 200 కోట్ల బడ్జెట్‌తో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నేషనల్ లెవల్లో ఈ సినిమా రూపొందిస్తున్నారు.