విషాదం.. బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే మృతి.. మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ తో కన్నుమూత.!

By team teluguFirst Published Nov 26, 2022, 4:41 PM IST
Highlights

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్  నటుడు విక్రమ్ గోఖలే (77) ఈరోజు తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం ఆస్పత్రికి వెళ్లిన ఆయన మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెల్యూర్ తో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 

వరుస విషాదాలతో చిత్ర పరిశ్రమలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఇటీవల రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు, ఈనెల 15న దివంగత, సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో సినీ లోకం తీవ్ర  విచారం వ్యక్తం చేస్తోంది. వీరి మరణవార్తను మరిచిపోకముందే.. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే (77) తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. 

అనారోగ్యంతో విక్రమ్ గోఖలే పూణెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనారోగ్యంతో గత 15 రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. పక్షం రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. అప్పటికే మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌ కారణంగా విక్రమ్ గోఖలే ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించి చనిపోయారు. ఇదే విషయాన్ని ఆయన భార్య కూడా తెలిపింది. విక్రమ్ కు భార్య వృశాలి గోఖ్లే, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. 

విక్రమ్ గోఖలే భౌతికకాయాన్ని సాయంత్రం 4 గంటలకే పూణేలోని బాలగంధర్వ రంగమందిర్‌లో కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల కోసం ఉంచారు. సాయంత్రం 6 గంటలకు పూణేలోని వైకుంఠ స్మశాన భూమిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు, బంధుమిత్రులు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్నారు. ఆయనతో అనుబంధాన్ని వెల్లడిస్తున్నారు. 

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (1999)లో ఐశ్వర్యరాయ్ బచ్చన్ తండ్రిగా విక్రమ్ గోఖలే అద్బుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీలో వచ్చిన పలు హిట్ చిత్రాలు 'హే రామ్', 'తుమ్ బిన్', 'భూల్ భులయ్యా', 'హిచ్కీ' మరియు 'మిషన్ మంగళ్' లోనూ నటించి మెప్పించారు. విక్రమ్ గోఖలే కు పూణేలో ఓ యాక్టింగ్ అకాడెమి కూడా ఉంది. అక్కడే తన భార్యతో కొన్నేళ్లుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. 

click me!