
హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక(Bheemla Nayak Prerelease event) ఘనంగా జరుగుతుంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో అతి తక్కువ మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో పవన్ ని చూడాలని వచ్చిన వేల మంది అభిమానులు బయట వేచి చూస్తున్నారు. డై హార్డ్ ఫ్యాన్స్ పవన్ పేరున నినాదాలు చేస్తున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. దీంతో 7 గంటలకల్లా పవన్ వేదిక వద్దకు చేరుకుంటారని అందరూ భావించారు.
అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ఆయన రాక కోసం చిత్ర యూనిట్, ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథి అయిన మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం వేదిక వద్దకు చేరుకోలేదు. పవన్ తో పాటే కేటీఆర్, తలసాని వచ్చే అవకాశం కలదు. దర్శకుడు సాగర్ కె చంద్ర, నిర్మాత నాగ వంశీ, సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే హాజరయ్యారు.
భీమ్లా నాయక్ సినిమాకు పాట పాడిన కిన్నెర మొగిలయ్యను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సత్కరించారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, నిర్మాత నాగ వంశీ ఆయనను శాలువా కప్పి గౌరవించారు. ఈ సందర్భంగా మొగిలయ్య చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు తెలిపారు. భీమ్లా నాయక్ మూవీతో కిన్నెర మొగిలయ్య వెలుగులోకి వచ్చారు. భారత ప్రభుత్వం ఆయన కళను గుర్తించి పద్మశ్రీ అవార్డుతో సత్కరియించింది. తెలంగాణా ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించడంతో పాటు కోటి రూపాయల ఆర్థిక సాయం చేసింది.