రొటీన్ రోత (‘భైరవ గీత’ రివ్యూ)

By Udayavani DhuliFirst Published Dec 14, 2018, 11:52 AM IST
Highlights

రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే ఈ మధ్యకాలంలో జనం భయపడిపోతున్నారు. పబ్లిసిటీ మీద పెట్టిన శ్రద్ద..సినిమా మీద పెట్టడం లేదని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. దాంతో ఈ సారి తన శిష్యుడుని ముందుపెట్టి ఆయన కథ నడిపించారు

--సూర్య ప్రకాష్ జోశ్యుల

రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే ఈ మధ్యకాలంలో జనం భయపడిపోతున్నారు. పబ్లిసిటీ మీద పెట్టిన శ్రద్ద..సినిమా మీద పెట్టడం లేదని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. దాంతో ఈ సారి తన శిష్యుడుని ముందుపెట్టి ఆయన కథ నడిపించారు. ‘భైరవ గీత’ అంటూ ఓ హింసాత్మక ప్రేమ కథా  చిత్రం రెడీ చేసారు. ట్రైలర్స్, టీజర్ లలో ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు. కన్నడ,తెలుగులో రూపొందిన ఈ చిత్రం గురించి ఆయన 2.0 ని అడ్డం పెట్టి పబ్లిసిటీ చేసారు. 

దాంతో వర్మ ఈజ్ బ్యాక్... భాక్సాఫీస్ హిట్ అని మీడియా హోరెత్తిపోయింది.  ఈ నేపధ్యంలో పెరిగిన అంచనాల మధ్య ఈ సినిమా రిలీజైంది. వర్మ తను పెంచిన అంచనాలను తాను అందుకోగలిగాడా...అసలు ఈ భైరవ గీత కథేంటి..జనాలకు ఈ గీత నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి..

రాయలసీమలో  పెద్ద ఫ్యాక్షనిస్ట్ సుబ్బారెడ్డి(బాల రాజ్‌వాడీ). అతని దగ్గర తక్కువ కులం వాడైన  భైరవ (ధనుంజయ)పని చేస్తూంటాడు. భైరవ తండ్రి,తాతలు కూడా ఆ కుటంబాల దగ్గర బానిసల లాగ ఒళ్లు వంచుకుని, కళ్లు మూసుకుని  పనిచేసినవారే. సుబ్బారెడ్డి కు ఓ కూతురు  గీత(ఇర్రా మోర్‌). ఆమెపై ఓ రోజు సుబ్బారెడ్డి శుత్రువులు ఎటాక్ చేస్తారు. ఆ ఎటాక్ లో ఆమెను ప్రాణాలకు తెగించి  భైరవ రక్షిస్తాడు.

దాంతో ఇమ్మిడియట్ గా భైరవ తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలిసి గీతను ఆమె తండ్రి  కట్టారెడ్డి (విజయ్‌ రామ్‌) అనే మరో ఫ్యాక్షనిస్ట్‌ తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాడు. నిశ్చితార్దంలో కట్టారెడ్డి చెంపపై కొట్టి..తాను భైరవనే పెళ్లి చేసుకుంటానని ప్రకటన చేస్తుంది. దాంతో భైరవను చంపేయమని పురమాయిస్తాడు సుబ్బారెడ్డి.  దాంతో గీత, భైరవ ఇద్దరూ ఊరొదిలి పారిపోతారు. ఇది తెలిసిన సుబ్బారెడ్డి ,కాబోయే అల్లుడు కట్టారెడ్డి ఊరుకుంటారా భైరవ తల్లిని, అతని ఫ్రెండ్స్ ని చంపేస్తారు.

దీంతో రగిలిపోయిన భైరవ..సుబ్బారెడ్డిపై యుద్దం ప్రకటిస్తాడు. తమ బానిస బ్రతుకులకు భైరవ విముక్తి కలిగించాలనుకుంటాడు. తోటి వారితో కలిసి తిరుగుబాటు చేస్తాడు.  సుబ్బారెడ్డి తక్కువవాడా..అణచటానికి రకరకాల ఎత్తులు వేస్తాడు. చివరికి ఈ యుద్దంలో ఎవరు గెలిచారు.?  భైరవ, గీత ఒక్కటయ్యారా? అన్నదే మిగతా కథ.

వర్మ ఎలా ఓకే చేసారో..

ఈ పై కథ చదివిన వారికి ఎక్కడైనా ఒక్క చిన్న వాక్యం కూడా కొత్తగా అనిపించదు..తరతరాలుగా తెలుగు సినిమాను ఏలుతున్న అనేక యాక్షన్, ఫ్యాక్షన్ ప్రేమ కథా సినిమాలు (అప్పట్లో చిరంజీవి ఖైదీ, వెంకటేష్ చంటి, విజయ్ శాంతి ఒసేయ్ రాములమ్మ, గోపీచంద్ యజ్ఞం ) వరసపెట్టి గుర్తు వచ్చేస్తాయి.  దాంతో సినిమా ఎంత కాలం వెనకటి కథతో తయారైందో అని అర్దం అవుతుంది.

కొంచెం కూడా కథలో కొత్తదనం లేని ఈ కథ వర్మకు నచ్చి ఓకే చేసాడంటే..ఆయన గత రెండు దశాబ్దాలుగా వస్తున్న తెలుగు సినిమాలకు దూరం అయ్యారనుకోవాలి. ఆయన ముంబైలో ఉండగా ఇక్కడ తెలుగు సినిమా ఇలాంటి కథలతో మాఫియాలా చెలరేగిపోయిందనే విషయం గుర్తించలేదేమో.  దాంతో ఇదేదో కొత్త సబ్జెక్టు లా అనిపించి ఉండవచ్చు. లేదా ..ఈ మధ్యకాలంలో తెలుగులో రావటం లేదు కదా..ఈ కాలం యూత్ ఆనాటి ప్రేమ కథలను మిస్ అయ్యారని ఫీలయ్యి...యస్ చెప్పారో కానీ చూస్తూంటే పరమ రోత సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.

స్క్రీన్ ప్లే..

ఫస్టాఫ్ లో కొన్ని థ్రిల్స్ ..ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే పండాయి. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి హింస మితిమీరిపోయింది. కొన్ని కీలకమైన పాత్రలు సినిమాలో చనిపోయినప్పటికి మనకేమీ అనిపించదు. అంత అనాసక్తిగా నడుస్తుందీ స్క్రీన్ ప్లే.

కథ రోత, తీత పాత

ఇక ఈ చిత్రం టేకింగ్ విషయానికి వస్తే వర్మ స్వయంగా డైరక్ట్ చేసి కొత్త దర్శకుడు పేరు వేసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వర్మ చాలా కాలంగా చేస్తున్న మేకింగ్ ఇదే. రక్త చరిత్రకు ప్రేమ కథ కలిపినట్లు అనిపిస్తుంది. అంతే తప్ప మేకింగ్ కొత్తగా అనిపించదు. అయితే ఓ కొత్త దర్శకుడు ఈ స్దాయిలో వర్మను గుర్తు చేసేలా మేకింగ్ చేసాడంటే మాత్రం మెచ్చుకోవాల్సిందే. అయితే డైరక్టర్ కన్నడ కుర్రాడు కాబట్టి అక్కడ సినిమా కథల స్దాయిలోనే ఈ సినిమాని రూపొందించాడు.  

అలాగే సినిమాని 'రా' గా తీయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ కథలో డ్రామాని మాత్రం పండించలేకపోయాడు. ఇలా సహజంగ రా గా తీయాలనుకున్నప్పుడు ..లాజిక్స్ కరెక్ట్ గా ఉండాలి. తనని ఫైట్ చేసి రక్షించాడని హీరోయిన్ ప్రేమలో పడిపోవటం వంటి సీన్స్ ఎవాయిడ్ చేయగలగాలి. అలాగే తన ప్రేమ కథను ప్రక్కన పెట్టి..తమ బానిస బ్రతుకులనుంచి విముక్తి కోసం పోరాడటం అనే అంశం కూడా కన్వీసింగ్ గా ఉండదు. అలాగే హింస మీద పెట్టిన దృష్టిని భావోద్వేగాల మీద దర్శకుడు దృష్టి పెట్టలేదు. దాంతో సీన్స్  తెరపై కదులుతున్నా..మన మనస్సులో సినిమాపై ఏ అభిప్రాయం కలగదు. 

టెక్నికల్ గా...

ఈ సినిమాలో హైలెట్ ఏమిటీ అంటే సినిమాటోగ్రఫి.  ఎడిటర్ మాత్రం ప్రేక్షకుడుకి అన్యాయం చేసాడు. మరింత ట్రిమ్ చేసే అవకాసం ఉన్నా వదిలేసాడు అని కోపం వస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. రీరికార్డింగ్ సైతం బాగుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన ధనుంజయ్ మాత్రం చాలా సీన్స్ లో గుర్తుంచుకునే స్దాయిలో నటించాడు.

ఫైనల్ థాట్

వర్మ ఒకప్పటి  తెలుగు సినిమాలపై  తీసిన సెటైరా అని అనిపిస్తుంది. అలాగే ఓవరాల్ గా సినిమా 'వర్మ గీసిన గీత' లా ఉంది తప్ప ఇది ఓ కొత్త దర్శకుడు తన 'కెరీర్ కు వేసుకున్న బాట'లా అనిపించలేదు.

రేటింగ్: 2/5 

ఎవరెవరు..

తారాగణం : ధనుంజయ, ఇర్రా మోర్‌, బాల రాజ్‌వాడీ, విజయ్‌ రామ్‌ తదితరులు

సంగీతం : రవి శంకర్‌

దర్శకత్వం : సిద్ధార్థ్‌ తాతోలు

నిర్మాత : రామ్‌ గోపాల్ వర్మ

click me!