
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ(58) మృతి చెందారు. దీనితో బెంగాలీ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. అభిషేక్ ఛటర్జీ ఆకస్మికంగా మృతి చెందారు అనే చెప్పాలి.
బుధవారం అభిషేక్ ఛటర్జీ ఓ టివి షోలో పాల్గొంటుండగా కడుపులో ఇబ్బందికరంగా, నొప్పిగా ఉన్నట్లు అనిపించిందట. దీనితో ప్రిన్స్ అన్వర్ షా రోడ్డులోని తన నివాసంలో ఒక సెలైన్ వేయించుకున్నారట. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రాథమిక వివరాలు ఇవే. ఆ తర్వాత ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో మృతి చెందారు అని అంటున్నారు. ఆకస్మికంగా అభిషేక్ ఛటర్జీ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కూడా జీర్జించుకోలేకున్నారు.
అభిషేక్ ఛటర్జీ మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అంటున్నారు. అభిషేక్ మృతితో బెంగాలీ సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ట్విట్టర్ వేదికగా అభిషేక్ ఛటర్జీ మృతి సంతాపం తెలిపారు.
'అభిషేక్ ఛటర్జీ అకాల మరణ వార్త విని ఎంతో బాధ పడ్డాను. అభిషేక్ ఛటర్జీ ప్రతిభగల నటుడు. ఆయన మృతి టీవీ, సినిమా రంగానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అంటూ మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. అలాగే కోల్ కతా మేయర్ కూడా సంతాపం తెలిపారు.
తుమీ కోటో సుందర్, ఓరా చార్జోన్,సురర్ ఆకాశే, తూఫాన్, మర్యాద, అమర్ ప్రేమ్ లాంటి చిత్రాలు అభిషేక్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అభిషేక్ ఛటర్జీ 1985లో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆయన బెంగాలీలో 100లో పైగా సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో ఆయనకు అవార్డులు దక్కాయి.