
మే డే రోజున బాహుబలి ది కన్ క్లూజన్ షో చూసేందుకు వచ్చిన కొంత మందితో ఐనాక్స్ ఫోరం మాల్ ప్రత్యేకత సంతరించుకుంది. నలభై సీట్లు ఒకే చోట బుక్ చేసుకున్న కొంత మంది బాహుబలి ప్రేమికులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి ఇక్కడికి వచ్చారు.
రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9వేల థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే తొలి వీకెండ్ లోనే 540 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన బాహుబలి ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
అయితే బాహుబలి ది బిగినింగ్ తరహాలో ఈసారి బాహుబలి ది కన్ క్లూజన్ బంగ్లా దేశ్ లో రిలీజ్ కాలేదు. దీంతో ఆరేళ్ల చిన్నారి నుంచి 66ఏళ్ల వృద్ధుల వరకు ఓ 40మంది పైగా టీమ్ సినిమా చూసేందుకు కలకత్తాలోని పోరమ్ మాల్ ఐనాక్స్ లో సోమవారం సక్సెస్ ఫుల్ గా బాహుబలి ది కన్ క్లూజన్ సినిమా చూసి బుధవారం తిరిగి వెళ్లిపోయారని ది టెలిగ్రాఫ్ కథనం.
సనావుల్ అఫ్రీన్ అనే 63ఏళ్ల బంగ్లాదేశీ యాడ్ ఏజెన్సీ వ్యాపారి వివరణ ప్రకారం... బాహుబలి విజువల్ లో ఉన్న గొప్పదనం మరే సినిమాలోనూ ఇప్పటివరకు చూడలేదని, డీవీడీల్లో చూసేకన్నా థియేటర్స్ లో చూస్తేనే అద్భుతమైన అనుభూతి కలుగుతుందని ఇక్కడిదాకా వచ్చామని చెప్తున్నాడు.
వీళ్లతోపాటు ఇదే టీమ్ లో వచ్చిన బంగ్లాదేశ్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్-ఐ ఏండీ ఫరీదుల్ రెజా సాగర్, కలేర్ కాంత డైలీ ఎడిటర్ ఇమ్ దాదుల్ హక్ మిలాన్, డ్రామా నటుడు అఫ్జల్ హుసేన్, అతని సతీమణి ఫ్యాషన్ డిజైనర్ తాజీన్ హలీమ్ తదితరులు ఉన్నారు.
బంగ్లాదేశ్ లో ఆ దేశంలో షూటింగ్ జరుపుకున్న సినిమాలు, లేదా బంగ్లాదేశీయులు సహ నిర్మాతలుగా వ్యవహరించిన సినిమాలు రిలీజ్ అవుతాయి.
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గ్రూప్ సోమవారం ఈవెనింగ్ షో కు గంట ముందే థియేటర్ కు చేరుకున్నారు. సినిమా చూశాక అంతా ఒకే మాట అనుకున్నారు. అదే.. బాహుబలి సినిమా కోసం రావటానికి పెట్టిన ఫ్లైట్ టికెట్ ఖర్చులు ప్రతీ పైసాకు బాహుబలి వ్యాల్యూ ఇచ్చిందని. బాహుబలి 1 కంటే 2 అద్భుతంగా ఉందని అంటోంది 14 ఏళ్ల యువతి తనీషా నహర్ రోజా. బాహుబలి1 సినిమాను 80 సార్లు డీవీడీల్లో చూశానని చెప్తోంది. ఈ గ్రూపులో బాహుబలి1ను 2015లో థియేటర్లో చూసిన ఒకే ఒక్కడు ఆమీర్ హుస్సేన్ ఖోకోన్.
ఈ గ్రూప్ లో ఒక యువతి తను అనుష్కలా హీరోయిన్ అవాలని అనుకుంటున్నానని అంది. వెంటనే పక్కనున్న అతను మీ నాన్నకు తెలుసా అని అరుపులు. మొత్తానికి బాహుబలి ఆ సాయంత్రం వాళ్ళందరి ముఖంలో నవ్వులు పూయించింది.
ఇలా బంగ్లాదేశ్ నుంచి చాలా మంది థియేటర్ కు వచ్చి బాహుబలి సినిమా చూడటం థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్. నాకు తెలిసీ కలకత్తాలో ఇలా బంగ్లాదేశీయులు ఒక సినిమాకు ఇన్ని టికెట్స్ బుక్ చేసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదని ఐనాక్స్ రీజనల్ డైరెక్టర్ సుభాషిస్ గంగూలీ అన్నారు. మొత్తానికి బాహుబలి ఎలాంటి వేవ్స్ క్రియేట్ చేస్తోందో ఉదాహరణ చూస్తేనే తెలుస్తోంది.