సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారనే దానిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
హైదరాబాద్: సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారనే దానిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. గత కొంతకాలంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ట్వీట్స్ చేస్తున్న బండ్ల గణేష్.. ఈ రోజు ‘‘మన కాంగ్రెస్ సైనికులు..’’ అంటూ ట్వీట్ చేశారు. ఈరోజు కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం.. మంత్రివర్గ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నూతన మంత్రులు బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ క్రమంలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బోస్ రాజుకు బండ్ల గణేష్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత నూతన మంత్రలు జాబితాతో కర్ణాటక కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్టు చేసిన ట్వీట్‌ను షేర్ చేసిన బండ్ల గణేష్.. ‘‘మన కాంగ్రెస్ సైనికులకు అభినందనలు (Congratulations our congress soldiers)’’ అని పేర్కొన్నారు. దీంతో బండ్ల గణేష్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని చాలా మంది భావిస్తున్నారు. అయితే గణేష్ చేసిన ట్వీట్ చూస్తే ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న భావనలో ఉన్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తూ వచ్చిన బండ్ల గణేష్.. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరి యాక్టివ్‌గా పనిచేశారు. తన వ్యాపార కార్యకలాపాలు, సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు హాజరై హడావిడి చేశారు. ఆ ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అని చెప్పుకునే బండ్ల గణేష్.. ఆ పార్టీలో చేరతారా? అనే చర్చ కూడా జరిగింది.
Congratulations our congress soldiers 💐 https://t.co/vxxTGJxZ0M
— BANDLA GANESH. (@ganeshbandla)అయితే కుటుంబ బాధ్యతల కారణంగా తాను రాజకీయాల నుంచి తప్పకుంటున్నట్లుగా బండ్ల గణేష్ గతేడాది అక్టోబర్‌లో ప్రకటించాడు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. మే 12వ తేదీన చేసిన ట్వీట్‌లో తాను రాజకీయ భవిష్యత్తు త్వరలో నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీలో చేరతారనే చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. అయితే తాజా ట్వీట్‌ను బట్టి చూస్తే బండ్ల గణేష్ మళ్లీ కాంగ్రెస్‌తో కలిసి సాగాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఆయన అధికారికంగా స్పందించాల్సి ఉంది.