
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు, అన్న, నటదిగ్గజం ఎన్టీఆర్ జీవితంపై సినిమా తెరకెక్కిస్తానని బాలకృష్ణ మరోసారి స్పష్టం చేశారు. అంతేకాక ఎన్టీఆర్ సినిమాలో తానే హీరోగా నటిస్తానని బాలయ్య స్పష్టం చేశారు. సినిమాలో పొందు పరచాల్సిన అంశాలపై తెలుగుదేశం పార్టీతో కలిసి నిర్ణయిస్తామన్నారు.
ఇక త్వరలోనే కార్యరూపం దాల్చనున్న ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించాలన్నది నిర్ణయించలేదని తెలిపారు. ఎన్టీఆర్ సినిమాలో ఆయన గురించి ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తనకు తెలుసని బాలకృష్ణ చెప్పారు. ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కించబోయే సినిమా కమర్షియల్ సినిమా కాదని ఆయన తెలిపారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలోని అన్ని కోణాలు ఆవిష్కరిస్తామని బాలకృష్ణ తెలిపారు. తనకు కూడా తెలియని ఎన్నో విషయాలు ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్నాయని బాలయ్య పేర్కొన్నారు. సినిమా నిర్మించిన తర్వాత దాన్ని అంతటా ప్రదర్శించాలా లేక అమరావతిలోని థియేటర్లలో ప్రజలకు ఉచితంగా చూసే అవకాశం కల్పించాలా అన్నది నిర్ణయిస్తామన్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ సినిమాలో ఆయన జీవితంలోని అన్ని కోణాలను ఆవిష్కరిస్తామని బాలకృష్ణ తెలిపారు.