బాలయ్య లాంటి గొప్ప బామ్మర్ది దొరకడం బాబు అదృష్టం!

By Sambi ReddyFirst Published Oct 5, 2022, 6:51 PM IST
Highlights

బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 సిద్ధమయ్యారు. త్వరలో నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఫస్ట్ గెస్ట్ గా బావను ఎంచుకొని బాలయ్య షోకి మంచి ప్రచారం తెచ్చిపెట్టాడు. 
 

చంద్రబాబు అంటే సొంత డప్పుకు కేర్ ఆఫ్ అడ్రెస్. ఆటో రిక్షా నుండి అంతరిక్షం వరకు ప్రతి డెవలప్మెంట్ లో తన హస్తం ఉందంటాడు. అసలు దేశం అభివృద్ధి చెందడానికి కారణం నేనే అంటారు. రాష్ట్రపతులను , ప్రధానులను కను సైగలతో ఎంపిక చేశాను అంటారు. ఆయన 'నేనే' పదం వాడతారు 'మనం' పలకడం అసలు తెలియదు. నేనే కి మనం కి తేడా మనందరికీ తెలుసు. ఈక్రమంలో బాబు గెస్ట్ గా బాలయ్య టాక్ షో ఎలా ఉంటుందో అంచనా వేయడం పెద్ద కష్టమేమీ కాదు. 

ఇప్పటికే దీనిపై హింట్ ఇచ్చేశారు. బాబు అన్ స్టాపబుల్ వేదికపైకి రాగానే ,సీఎం సీఎం, అని ఆ షోకి హాజరైన ఆడియన్స్ అరుస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. కాదు కాదు వైరల్ చేస్తున్నారు. ఇక్కడే అర్థం అవుతుంది బాబు ఎలివేషన్స్ కి ఎలాంటి పునాది వేశారో. ఒక టాక్ షోకి హాజరయ్యే ఆడియన్స్ అనేక వర్గాల వారుంటారు. ఏపీతో పాటు తెలంగాణాకు ప్రజలుంటారు. అలాంటప్పుడు మూకుమ్మడిగా అందరూ బాబు రాగానే సీఎం అని అరిశారంటే దానర్థం ఏమిటీ...?

ముందుగానే పెయిడ్ ఆర్టిస్ట్స్ తో చేయించిన సన్నాహమని బుర్రున్న ఎవరుడికైనా అర్థం అవుతుంది. బాబు సీఎంగా లేని రాష్ట్రం చీకట్లోకి వెళ్ళిపోయింది. తప్పు తెలుసుకున్న ప్రజలు ఆయన పీఠం ఎక్కాలని గట్టిగా కోరుకుంటారని చెప్పే ప్రయత్నం ఇది. ఏపీలో ఆయన బహిరంగ సభల్లో కనిపించని సీన్ బాలయ్య షోలో క్రియేట్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ మొత్తం బాబు నామస్మరణ, ఆయన కల్పిత విజయాల పారాయణంతో సాగనుంది. 

బాలయ్య ప్రశ్నలు ఆయన సమాధానాలు ముందుగానే డిసైడ్ అయ్యాయి. ఎలాంటి ప్రశ్నలు వేస్తే బాబు ఔన్నత్యం బయటపడుతుందో, అవి ఏమిటో బాలయ్య ముందుగానే బావ వద్ద నోట్స్ రాసుకొని ఉంటాడు. ఇప్పటికే వాటన్నింటినీ నిద్ర లేకుండా బట్టీ పడుతూ ఉండొచ్చు. మరి కీలకమైన ఎన్టీఆర్ టు బాబు అధికార మార్పిడి ఎపిసోడ్ ని ప్రస్తావిస్తారా? లేదా? అనేది సస్పెన్సు. ఒకవేళ చర్చకు తీసుకొచ్చినా నాన్న ఎన్టీఆర్ నే బద్నామ్ చేసి బాబును రాజకీయ చాణక్యుడిగా, టీడీపీ సంరక్షకుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరగవచ్చు. ఏదేమైనా ఈ షోలో నిజాలు ఉండవు, కేవలం బాబు భజనలు తప్ప. 

నిజాలు వక్రీకరించి లేనిది ఉన్నట్లుగా చూపించి ఎన్టీఆర్ బయోపిక్స్ విషయంలో బాలయ్య బొక్క బోర్లా పడ్డాడు. అందరికీ తెలిసిన చరిత్రను బావకు అనుకూలంగా మలిచి అబాసు పాలయ్యాడు. ఎన్టీఆర్ కటాక్షం లేని ఆయన బయోపిక్ అవమానాల పాలైంది. చూసే నాథుడు లేక థియేటర్స్ వద్ద ఉచితంగా చూసి వెళ్లండని బోర్డులు పెట్టుకున్నారు. 

2019 ఎన్నికల్లో బాబుకు ఏంతో కొంత ప్రయోజనం చేకూరేలా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్(మహానాయకుడు) తీశాడు. ప్రస్తుత అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్ కూడా అలాంటి ప్రణాళికే. బాబు ఏమిటో ప్రజలకు పూర్తిగా తెలిశాక ఈ సినిమా తెలివితేటలు పని చేస్తాయని నమ్మడం అవివేకమే. అన్ స్టాపబుల్ షో పేరిట వీర లెవెల్ ఎలివేషన్స్ తో కూడిన బాబు బయోపిక్ కి చూడటానికి సిద్ధంగా ఉండండి.. 

click me!