
ప్రముఖ దర్శకుడు శరత్ మరణంపై సినీపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పరిశ్రమకు చెందిన దిగ్గజాలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలనే నందమూరి బాలకృష్ణ శరత్ గురించి మాట్లాడారు.
ప్రముఖ సినీ దర్శకుడు శరత్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం ఇంట్లోనే కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. శరత్ మృతి పట్ల నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మంచి దర్శకుడిని, ఆప్తుడిని కోల్పోయామని ఆయన అన్నారు. తనకు ఆయన ఎంతో ఆప్తుడని చెప్పారు.
పరిశ్రమలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న కొద్ది మందిలో శరత్ కూడా ఒకరని అన్నారు బాలయ్య. ఆయనతో తాను వంశానికొక్కడు పెద్దన్నయ్య, సుల్తాన్ వంశోద్ధారకుడు సినిమాలు చేశానని చెప్పారు. ఆయన మరణవార్త తనను బాధించిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని... వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు బాలయ్య.
ఇక చాదస్తపు మొగుడు సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా శరత్ పరిచయం అయ్యారు. ఏఎన్నార్, బాలకృష్ణ, సుమన్ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి వరుసగా సక్సెస్ లు అందుకున్నారు శరత్. ఏఎన్నార్‌తో కాలేజీ బుల్లోడు, జగపతిబాబుతో, భలే బుల్లోడు, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్ లాంటి సినిమాలను రూపొందించారు. అలాగే సుమన్‌తో చాదస్తపు మొగుడు తో పాటు పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, చిన్నల్లుడు వంటి సినిమాలను రూపొందించారు. ఇన్ని సినిమాలు చేసిన ఈదర్శకుడు జీవివతాంతం బ్యాచిలర్ గానే ఉండిపోయాడు.