‘బలగం’ గాయకుడు పస్తం మొగిలయ్య (Balagam Mogulaiah) ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారులు, పస్తం మొగులయ్య ఆరోగ్యం విషయంగా ఉందని తెలుస్తోంది. Balagam సినిమాలో భార్య కొమురమ్మతో కలిసి కనిపిస్తారు. బుర్రకథతో అందరినీ అలరించారు. తోబుట్టువులు ఎలా వుండాలో చెబుతూ ఈ దంపతులు పాడిన పాట ప్రతిఒక్కరి గుండెను గెలుచుకుంది. ఇందుకు మొగిలయ్య, కొమురయ్య దంపతులకు ‘నారి పురస్కారం’ అందిన విషయం తెలిసిందే. రూ.2 లక్షల ఆర్తిక సహాయం కూడా అందించారు.
అయితే, కొద్దిరోజుల కింద రెండు కిడ్నీలు పాడయిపోయి, వైద్యం చేయించుకోడానికి డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నట్టు వార్తలు వచ్చాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా నిలిచిన విషయం తెలిసిందే. వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లపై ఆదేశాలిచ్చారు. దీంతో వారం రోజులుగా వరంగల్ లోని ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. మొగులయ్య ఆరోగ్యం విషయంగా ఉందని తెలుస్తోంది. కిడ్నీ సమస్యకు తోడు గుండె సంబంధించిన సమస్య కూడా రావడంతో హెల్త్ కండీషన్ సీరియస్ గానే ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు తన భార్య కొమురమ్మ సైతం మొగిలయ్య ఆరోగ్యపరిస్థితి సీరియస్ గా ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. మెరుగైన వైద్యం కోసం మొగిలయ్యను హైదరాబాద్ కు కాసేపట్లోనే తరలించనున్నారు. యశోద ఆస్పత్రిలో చేర్పించబోతున్నట్టు తెలుస్తోంది. మొగులయ్య హెల్త్ పై మంత్రి దయాకర్ కూడా వైద్యులకు పలు సూచనలు చేశారని తెలుస్తోంది.
ఇక ఇప్పటికే మొగిలయ్యను వెలుగులోకి తీసుకువచ్చిన బలగం డైరెక్టర్ వేణు (Venu Yeldandi) కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని సాయం అందించారు. బలగం రిలీజ్ తర్వత లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. కానీ ప్రస్తుతం మొగులయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుండటంతో సినిమా చూసిన వారందరూ ఆందోళన పడుతున్నారు. తిరిగి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.