
బలగం మూవీ నటులు ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ. దశాబ్దాలుగా వీరు పరిశ్రమలో ఉన్నప్పటికీ రాని గుర్తింపు బలగం మూవీ తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో కొమురయ్య కొడుకు ఐలయ్య పాత్రను కోటా జయరాం చేశారు. ఈ కథలో ఆయన పాత్ర చాలా కీలకం. పూర్తి నిడివితో కూడుకుని ఉంటుంది. ఐలయ్య పాత్రను కోటా జయరాం అత్యంత సహజంగా నటించి మెప్పించారు. పతాక సన్నివేశాల్లో అయితే... ఏడిపించేశారు
తాజా ఇంటర్వ్యూలో కోటా జయరాం బలగం మూవీతో పాటు తన కెరీర్ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. కోటా జయరాం దాదాపు 40 సీరియల్స్ లో నటించారట. పోలీస్ పాత్రలకు మేకర్స్ ఆయన్ని సంప్రదించేవారట. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారట. ఒక మూవీ షూటింగ్ లో ఆయనకు పెద్ద అవమానం జరిగిందట. జయరాం నటన బాగుంది ఫోకస్ ఆయన మీద పెడదాం అని కెమెరా మెన్ అన్నాడట. దానికి కో డైరెక్టర్... ఆయన మీదెందుకు. ఆ కుక్క మీద పెట్టు అన్నాడట.
కో డైరెక్టర్ మాటకు జయరాం మనసు గాయపడిందట. ఒక కుక్కకు ఉన్న మర్యాద కూడా ఆర్టిస్ట్ కి లేదని వాపోయాడట. నిజానికి బలగం మూవీలో ఆయన మిత్రుడు చేయాల్సిందట. ఆయన చేయను అనడంతో జయరాం వద్దకు వచ్చిందట. దర్శకుడు వేణు జయరాం ని ఆడిషన్ చేశాడట. మూడు నెలల తర్వాత బలగం మూవీలో ఎంపికైనట్లు చెప్పారట. అలా బలగం మూవీ తనకు దక్కిందని జయరాం చెప్పుకొచ్చారు.
దర్శకుడు వేణు ఎల్దండి విలేజ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. తెలంగాణ పల్లె నేటివిటీ, కుటుంబాల మధ్య మనస్పర్థలు, అనుబంధాలకు వేణు ఇచ్చిన వెండితెర రూపం జనాలకు విపరీతంగా నచ్చేసింది. దిల్ రాజు బలగం నిర్మాతగా ఉన్నారు. అనేక అంతర్జాతీయ అవార్డ్స్ బలగం మూవీ దక్కించుకుంది.