
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచమంతా మెచ్చుకునే స్థాయికి తీసుకెళ్లిన సినిమా రాజమౌళి బాహుబలి. నిజానికి ఈ సినిమా ప్లాన్ చేసినప్పుడు బాహుబలి’ని ఒక్క సినిమాగానే చేయాలని రాజమౌళి అండ్ టీమ్ భావించారట. ఐతే నిడివి ఎక్కువవుతోందని.. రెండు భాగాలుగా చేస్తే అన్ని విధాలా మంచిదని ‘ది బిగినింగ్’.. ‘ది కంక్లూజన్’ అంటూ రెండు పార్ట్‌లుగా విభజించారు.
ఐతే తొలి భాగమే రెండున్నర గంటలకు పైగా నిడివి వచ్చింది. ముందు అనుకున్న స్క్రిప్టులో మార్పులేమీ చేయలేదని.. కొత్త సన్నివేశాలేమీ చేర్చలేదని రాజమౌళి చెప్పిన నేపథ్యంలో రెండో భాగం నిడివి మరీ ఎక్కువేమీ ఉండదని అంతా అనుకున్నారు. ‘ది కంక్లూజన్’ నిడివి రెండు గంటలకు కొంచెం ఎక్కువగా ఉంటుందని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అయితే రెండో భాగం నిడివి 2 గంటల 50 నిమిషాల వరకు వచ్చినట్లు స్వయంగా రాజమౌళే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.
ఈ నిడివిని కొంచెం తగ్గించే ప్రయత్నాల్లో ఉందట ‘బాహుబలి’ టీం. నిడివి విషయంలో ‘ది బిగినింగ్’కు , ‘ది కంక్లూజన్’ కు తేడా ఉండబోదని తెలుస్తోంది. ఐతే ఈ మధ్య కాలంలో సినిమాల నిడివి చాలా తక్కువ ఉండేలా చూసుకుంటున్నారు సినీ దర్శకనిర్మాతలు. చాలా సినిమాలు రెండుంబావు గంటలకు మించట్లేదు. కానీ బాహుబలి లాంటి విజువల్ వండర్స్‌కు లెంగ్త్ ఇంకా ఎక్కువుండాలనే కోరుకుంటారు ప్రేక్షకులు. కాబట్టి జక్కన్న చెప్పిన 2 గంటల 50 నిమిషాల నిడివి ఉన్నా... బాహుబలి 2 సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూస్తారనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సో 10 నిమిషాలు కూడా తగ్గించాల్సిన అవసరం లేదు. తమ్ముళ్లందరికీ సరిపోయేంత పెద్దదిగా సినిమా ఉంటేనే మరింత వినోదం.