
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన సినిమా రాజమౌళి చెక్కిన బాహుబలి. అలాంటి ‘బాహుబలి’కి అనేక గౌరవాలు దక్కాయి. 2015 సంవత్సరానికి జాతీయ ఉత్తమ చిత్రం ఇదే. ఇంకా జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు.. గౌరవాలు ‘బాహుబలి’ని వరించాయి. తాజాగా బాహుబలికి మరో అరుదైన గౌరవం దక్కింది.
భారత దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ ఏడాదికి 70 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో బ్రిటన్లో నిర్వహించబోయే భారత సంస్కృతి ఉత్సవాల్లో భాగంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రిమియర్ షోను ప్రదర్శించబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 28న ‘బాహుబలి-2’ రిలీజవుతుండగా..ఆ ముందు రోజు బ్రిటన్లో ఈ ప్రిమియర్ షో ఉంటుంది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ‘బాహుబలి-2’ ప్రిమియర్ షోలు ఉంటాయి కానీ.. ఈ షో ప్రత్యేకం. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కూడా బాహుబలి షోను తిలకించనున్నారు.
బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటన్ కౌన్సిల్, బ్రిటన్లో ఇండియన్ హై కమిషన్ ఉమ్మడిగా ఈ సంస్కృతి ఉత్సవాల్ని నిర్వహించనుండటం విశేషం. ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగానే ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. ఇలా ఓ దేశ ప్రభుత్వం.. ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఉత్సవాల్లో మన సినిమాను ప్రదర్శించబోతుండటం అరుదైన విషయమే.
మార్చి నెల మధ్యలోనే బాహుబలి2 ట్రయలర్ లాంచ్ చేయబోతున్నారు. మూడు వారాల పాటు పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసి ఏప్రిల్ 28న భారీ స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్టో ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.