
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్నన్ని భారీ చిత్రాలు మరే ఇండియన్ హీరో చేయడం లేదు. రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ ఇలా అన్ని చిత్రాలు పాన్ ఇండియా మూవీసే. సంక్రాంతికి విడుదల కావాల్సిన రాధే శ్యామ్ చిత్రం కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
ఇదిలా ఉండగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న ప్రాజెక్ట్ కె చిత్రం వరల్డ్ వైడ్ గా వైబ్రేషన్స్ క్రియేట్ చేయబోతోంది అనే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని కేవలం పాన్ ఇండియా మూవీ గానే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
తాజాగా నిర్మాత అశ్వినీ దత్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం హాలీవుడ్ దర్శకులంతా ఆరా తీస్తున్న ఏకైక ఇండియా హీరో ప్రభాస్ అని తెలిపారు. ప్రాజెక్ట్ కె తర్వాత ప్రభాస్ కేవలం హాలీవుడ్ చిత్రాలు మాత్రమే చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్ కె చిత్రం అంతటి ప్రభావం చూపబోతోందని అశ్విని దత్ అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించబోతున్నాడు అని.. మూడవ ప్రపంచ యుద్ధం నుంచి ప్రజలని రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపిస్తాడు అంటూ కథ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకు కూడా అందనంత ఎత్తులో ఉన్నాడనేది వాస్తవం. రాధే శ్యామ్ చిత్రం జనవరి 14న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడింది. అలాగే ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ షూటింగ్ కూడా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.