ఆస్కార్స్ కు నామినేట్ అయిన ‘నాటు నాటు’ సాంగ్ తప్పకుండా అవార్డు గెలవాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
ఆస్కార్స్ అవార్డ్స్ వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఒక్కరోజులో ఆస్కార్స్ ను ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ వేడుకపై భారతీయుల్లో చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈసారి ఇండియా నుంచి ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ RRR లోని Naatu Naatu సాంగ్ ‘ఆస్కార్స్’కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఈ పాట అకాడెమీ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఈ సాంగ్ తో పాటు ఆయా హాలీవుడ్ సాంగ్స్ కూడా గట్టిపోటీనిస్తున్నాయి. రీసెంట్ గా ‘నాటు నాటు’కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో Oscars2023 అవార్డు మనదే అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు AR Rahman తొలిసారిగా ఆస్కార్స్ కు నామినేట్ అయిన ‘నాటు నాటు’ సాంగ్ పై స్పందించారు. ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. నాటు నాటుకు ఆస్కార్ అవార్డు వస్తే ప్రపంచంలో భారతదేశం మరింత పైస్థాయికి వెళ్తుంది. నాటు నాటు గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి అవార్డు మనలో ఎవరికి వచ్చినా మన ప్రాంతం, మన సంస్కృతికి మరింత ప్రాధాన్యత పెరుగుతుంది.’ అని చెప్పుకొచ్చారు. ఆస్కార్స్ కు ఒక్కఅడుగు దూరంలో ‘నాటు నాటు’ ఉన్న సందర్భంలో ఏఆర్ రెహమాన్ మాటలు మరింత ఆసక్తికరంగా మారాయి.
ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఆస్కార్స్ వేడుకలో ‘నాటు నాటు’ లైవ్ మ్యూజిక్ పెర్పామెన్స్ కోసం ఆహ్వానం అందడం విశేషం. ఇప్పటికే ఈపాటను ఆలపించిన ప్రముఖ సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్స్ వేడుకలకు హాజరయ్యేందుకు అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు హాలీవుడ్ నటి లారెన్ ‘నాటు నాటు’కు ఆస్కార్స్ వేదికపై డాన్స్ చేయబోతుండటం ‘ఆర్ఆర్ఆర్’ లవర్స్ కు స్వీట్ న్యూస్ గా మారింది. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ టీమ్ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ వేడుకలో పాల్గొనబోతుండటం పట్ల ఫ్యాన్స్ ఆనందానికి అవధ్లుల్లేవు. భారత కాలమానం ప్రకారం.. మార్చి 13న వేడుక జరగనుంది. ఈవెంట్ ను లైవ్ గా చూసేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు.
‘ఆర్ఆర్ఆర్’ విడుదలై ఏడాది గడుస్తున్నా ఇంకా ‘నాటు నాటు’సాంగ్ ఊపు తగ్గలేదు. దీంతో ఈ పవర్ ప్యాక్డ్స్ సాంగ్ తప్పకుండా ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాటు నాటు సాంగ్ కు ఎంఎం కీరవాణీ సంగీతం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడారు. రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఉక్రెయిన్ లో ప్యాలెస్ వద్ద ఈపాటను 12 రోజుల పాటు షూట్ చేశారు. గోల్డెన్ గ్లోబ్, హెసీఏ అవార్డులను సైతం దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.