
గత మూడు నెలలుగా టికెట్స్ ధరల వివాదం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్స్ ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై పై కొందరు పరిశ్రమ పెద్దలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంత తక్కువ ధరలతో సినిమా పరిశ్రమ మనుగడ సాధ్యం కాదని, టికెట్స్ ధరల (AP Ticket Prices) విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు. కొందరైతే ప్రభుత్వం పై సెటైర్స్ వేస్తూ కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే టికెట్స్ ధరలపై పరిశ్రమలో ఏకాభిప్రాయం లేదని తెలుస్తుంది. ధరల తగ్గింపును కొందరు సమస్యగా భావించడం లేదు. దానికి సీనియర్ హీరో, నిర్మాత నాగార్జున వ్యాఖ్యలే నిదర్శనం. బంగార్రాజు మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో నాగార్జున ఈ విషయంపై స్పందించారు.
ఏపీలో అమలవుతున్న టికెట్స్ ధరల వలన వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. తన సినిమాకు ఆ ధరలు సరిపోతాయి, దానిని సమస్యగా భావించడం లేదన్నారు. నాగార్జున (Nagarjuna)కామెంట్ తో టికెట్స్ ధరల వివాదం మరో కోణం తీసుకుంది. తాజాగా సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కొందరి ప్రయోజనాల కోసం నడుస్తున్న రచ్చ మాత్రమే.. పరిశ్రమ సమస్య కాదంటూ కీలక ఆరోపణలు చేశారు.
పాన్ ఇండియా పేరుతో రెట్టింపు సినిమా టికెట్స్ ధరలు వసూలు చేస్తున్న నిర్మాతలు సదరు సినిమాకు పనిచేసిన కార్మికులకు రెట్టింపు చెల్లించడం లేదు కదా.. ఆ డబ్బులన్నీ ఎక్కడికిపోతున్నాయి. టికెట్స్ ధరలు తగ్గింపు అసలు సమస్యే కాదు. ఆ ఐదారుగురు ప్రయోజనాల కోసమే ఈ రాద్ధాంతం అంతా. తమ హీరో సినిమా టికెట్ వెయ్యి రూపాయలు అమ్మాలని ఫ్యాన్స్ మాత్రమే అనుకుంటున్నారు. సామాన్యులు మాత్రం టికెట్స్ దరల తగ్గింపు ఉపశమనంగా భావిస్తున్నారు. దీనిని ఒక సమస్యగా చూడడం లేదు.
తెలంగాణ రాష్ట్రం వరకు టికెట్స్ ధరల విషయంలో ఎటువంటి సమస్య లేదు. తెలంగాణా ప్రభుత్వం ధరలు పెంచుకునేలా అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఏపీలో అమలవుతున్న టికెట్స్ ధరల నిర్ణయంపై సీఎం జగన్ (CM YS Jagan), సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా చిత్ర పరిశ్రమ నడుస్తుంది. పరిశ్రమపై ప్రభుత్వ నియంత్రణ లేదు. బ్యానర్ రిజిస్ట్రేషన్, టైటిల్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ పర్మిషన్ ప్రభుత్వ పరిధిలో లేవు. పరిశ్రమలో చాలా మంది చట్టాలు అనుసరించడం లేదు. చట్టాల అతిక్రమణ జరుగుతుంది. దీనిపై సమగ్ర నివేదిక త్వరలో వెల్లడిస్తాను. టికెట్స్ ధరలు ఏపీ ప్రభుత్వం పేదవారికి అందుబాటులోకి తెచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాను.. అని సీవీఎల్ నరసింహారావు సంచలన కామెంట్స్ చేశారు.
సీవీల్ నరసింహారావు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆయన వ్యాఖ్యలకు పరిశ్రమ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) టికెట్స్ ధరలు తగ్గించడం ముమ్మాటికీ తప్పుడు నిర్ణయం అంటున్నారు. వరుస ట్వీట్స్ తో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరి సీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలకు ఆయన వివరణ ఇస్తారేమో చూడాలి.