
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృదం సక్సెస్ మీట్‌లతో మరింత ఊపు తీసుకొస్తుంది. సినిమాని మరింతగా జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సక్సెస్ పార్టీల పేరుతో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఇటీవల తిరుపతిలో ఓ ఈవెంట్ జరిగింది. బన్నీ కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చెన్నైలోనూ ఓ ఈవెంట్ నిర్వహించారు. తమిళ ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పింది `పుష్ప` టీమ్. ఈ ఈవెంట్లలో బన్నీతోపాటు హీరోయిన్ రష్మిక మందన్నా, అలాగే దర్శకుడు సుకుమార్ కూడా పాల్గొంటున్నారు.
`పుష్ప` సినిమాకి ముందు సుకుమార్ బిజీగా ఉండటంతో ఈవెంట్లలో పాల్గొనలేకపోయారు. దీంతో ఇప్పుడు ఆయన ప్రతి ఈవెంట్లో పాల్గొంటూ అభిమానులకు, ఆడియెన్స్ కి, తన టీమ్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే నేడు శుక్రవారం(డిసెంబర్ 24) కాకినాడలో సక్సెస్ పార్టీని ప్లాన్ చేశారు. అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. ఇక ఈవెంట్ జరగడమే తరువాయి అనుకున్నసమయంలో పెద్ద షాక్ తగిలింది. ఏపీ ప్రభుత్వం `పుష్ప`కి బిగ్ షాక్ ఇచ్చింది. ఈవెంట్ నిర్వహించేందుకు పర్మీషన్ ఇవ్వలేదు. అధికారిక పర్మీషన్ సమస్య కారణంగా కాకినాడ `పుష్ప` ఈవెంట్‌ని రద్దు చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
`పుష్ప` సక్సెస్ సెలబ్రేషన్‌కి సంబంధించి పర్మీషన్ ఇవ్వకపోవడానికి కరోనా కారణమని తెలుస్తుంది. అదేసమయంలో టాలీవుడ్‌ని దెబ్బకొట్టే ప్రయత్నం కూడా ఇందులో దాగుందనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చిత్ర బృందం ప్రకటిస్తున్న కలెక్షన్ల లెక్కలు కూడా ఓ కారణమనే టాక్ కూడా వినిపిస్తుంది. భారీగా కలెక్షన్లు ప్రకటించడం ఏపీ ప్రభుత్వం పెద్దలకు మింగుడు పడటం లేదని, దీంతో చిత్ర పరిశ్రమపై ఎఫెక్ట్ అయ్యే కార్యక్రమాలు చేస్తున్నారనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా జోరు మీదున్న `పుష్ప`కిది బ్రేకులు వేసినట్టే అని, బన్నీ అభిమానులకు నిరాశ కలిగించే అంశమని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే `పుష్ప` చిత్రానికి సంబంధించి మొదటి వారంలో వచ్చిన కలెక్షన్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిత్రనిర్మాతలు వారంలో 229 కోట్లు వసూలు చేసిందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఇది 183కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసిందని టాక్. అయితే కేవలం థియేటర్ల రూపంలోనే ఈ రేంజ్ కలెక్షన్లు రావడం పట్ల చిత్రబృందం హ్యాపీగా ఉందని టాక్. శాటిలైట్, ఓటీటీ రైట్స్ దీనికి అదనంగా ఉంటాయని తెలుస్తుంది. అదేసమయంలో బన్నీ సింగిల్ హ్యాండ్‌తో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. `పుష్ప` సినిమాలో అద్భుతమైన నటనతోనే మెప్పించిన బన్నీ.. ఈ స్థాయి కలెక్షన్లని రాబట్టడం పట్ల అభిమానులు హ్యాపీగా ఉన్నారట.
ఇక బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం `పుష్ప`లో రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఓ కూలీ పనిచేసే పుష్ప.. పుష్పరాజ్‌గా, ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎలా ఎదిగాడనే కోణంలో సినిమాని రూపొందించారు. పుష్పరాజ్‌గా బన్నీ అద్భుతమైన నటనతో మెప్పించారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించారు. సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, జగదీష్ ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా లెవల్‌లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికిసంబంధించి రెండో పార్ట్ `పుష్పః ది రూల్` ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుందట.