
2019 సార్వత్రిక ఎన్నికల ముందు ఆలీ (Ali) వైసీపీ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ తరఫున ఆలీ ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆలీకి జగన్ ఎటువంటి సీటు ఇవ్వలేదు. అయినప్పటికీ ఆలీ వైసీపీ పార్టీ తరపున కొన్ని ప్రాంతాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. జగన్ సీఎంగా అధికారం చేపట్టినప్పటి నుండి ఆలీకి కీలక పదవి దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆయన కూడా సీఎం జగన్(CM YS Jagan) కి టచ్ లో ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో సీఎం జగన్ ని ఆలీ కొన్ని పర్యాయాలు కలిశారు. ఇటీవల చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కొరకు చిరంజీవి నేతృత్వంలో ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల సీఎం జగన్ ని కలిశారు. అతికొద్ది మందికి మాత్రమే ఈ మీటింగ్ కి ఆహ్వానం అందగా వారిలో ఆలీ ఒకరు.
ఈ మీటింగ్ అనంతరం ఆలీ సతీసమేతంగా సీఎం జగన్ ని ఆయన నివాసంలో కలిశారు. అప్పుడే ఆలీకి సీఎం జగన్ హామీ ఇవ్వడం జరిగింది. నేడు దీనిపై అధికారిక ప్రకటన రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ (AP WAQF Board Chairman) గా ఆలీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారందరికీ ఏదో ఒక రూపంలో ప్రయోజనం చేకూరుస్తున్నారు జగన్. చిత్ర పరిశ్రమ నుండి పోసాని, థర్టీ ఇయర్స్ పృథ్వి కూడా వైసీపీ పార్టీకి మద్దతు తెలిపారు. థర్టీ ఇయర్స్ పృథ్వికి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న పృథ్వి ఆ పదవి కోల్పోయారు. ఇక పోసాని.. తనకు ఎటువంటి పదవులు వద్దంటున్నారు.