
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. `ఆచార్య`(Acharya)చిత్రానికి టికెట్ల రేట్లు(Ticket Rates) పెంచుకునే అవకాశాన్ని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కల్పించింది. విడుదలైన రోజు నుంచి పది రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. టికెట్‌పై యాభై రూపాయలు పెంచుకునే వెసులుబాటుని కల్పించింది. సినిమా బడ్జెట్ పెరిగిన దృష్ట్యా `ఆచార్య` టీమ్ రిక్వెస్ట్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చిరంజీవి, ఆయన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మల్టీఫ్లెక్స్, లార్జ్ స్క్రీన్ థియేటర్స్, రీక్లైనింగ్ సీట్స్ కలిగిన థియేటర్స్ రూ. 50 వరకు అదనంగా టికెట్ ధరలు పెంచుకునేలా పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. సింగిల్ స్క్రీన్ ఏసీ థియేటర్స్ లో రూ. 30 అదనంగా టికెట్ ధర పెంచుకునేలా అనుమతులు జారీ చేశారు. మిగతా థియేటర్స్ లో ధరలు యధాతధంగా ఉంటాయి. మొదటి వారం రోజులు మాత్రమే టికెట్స్ ధరల పెంపునకు అనుమతినిచ్చారు. ఈ క్రమంలో టికెట్స్ ధరలు రూ. 210, రూ. 350లుగా ఉండనున్నాయి. అలాగే ఉదయం 7 గంటల నుండి రాత్రి 1 వరకు ఐదు షోలు ప్రదర్శించుకునేలా అనుమతులు ఇచ్చారు. చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం 'ఆచార్య'. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతుంది.
మరోవైపు టికెట్ రేట్లు పెంచుకునే విషయంపై చిరంజీవి స్పందించారు. చిరంజీవి సినిమాకి కూడా టికెట్లు రేట్లు పెంచుకోవాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నకి చిరంజీవి మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. కరోనా విపత్తు కారణంగా అన్ని పరిశ్రమలు కుదేలయ్యాయి. చిత్ర పరిశ్రమ కూడా భారీగా నష్టపోయింది. సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగిపోయింది. రూ. 50 కోట్లు వడ్డీల రూపంలో కట్టాము. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఆసరా కోరడం తప్పేమీ కాదు. ప్రభుత్వాలు టికెట్స్ ధరలు పెంచుకునేలా జీవోలో జారీ చేసి మద్దతిస్తున్నాయి. టికెట్స్ ధరలు పెంచుకోవడం అడుక్కోవడం కూడా కాదు. మనం అందరం ప్రభుత్వాలకు టాక్స్ కడుతున్నాం. అందరికంటే అత్యధికంగా 42% టాక్స్ కడుతున్నాం. అలాంటప్పుడు కొంత తిరిగి తీసుకోవడం తప్పులేదు. సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. కష్టపడి సినిమా తీశారు, వినోదం పంచుతున్నారని ప్రజలు ఓ పదిరూపాయలు ఎక్కువ చెల్లిస్తున్నారు. కాబట్టి టికెట్స్ ధరలు పెంచి జస్టిఫై చేస్తున్నాం, ఇందులో తప్పేమీ లేదంటూ ఫైర్ అయ్యారు.