
బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్ల కోసం దక్షిణాది హీరోయిన్లు ఏ రేంజ్ లో కలలు కంటారో మనకు తెలిసిందే. దక్షిణాదిలో టాప్ హీరోయిన్లుగా ఉన్నా.. హిందీ చిత్రాల్లో ఆఫర్స్ అంటే మాత్రం అంత ఈజీ కాదు. అలాంటిది బాహుబలి తర్వాత తనకొచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన అనుష్క మాత్రం.. తన కాళ్ల దగ్గరికొచ్చిన బాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించింది. బాహుబలి-2 చిత్రంతో దేవసేనగా అనుష్క అందరి మనసులను గెలుచుకుంది. దీంతో బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అలా వచ్చిన ఓ ఆఫర్‌ను కాస్తా దేవసేన చేజార్చుకుందట.
అనుష్క బాలీవుడ్ ఆఫర్ తిరస్కరించిన విషయాన్ని స్వయాన ఓ బాలీవుడ్ యంగ్ డైరెక్టర్ చెప్పడం విశేషం. అనుష్కకు కథ వినిపించానని, కథ ఆమెకు చాలా బాగా నచ్చిందని బాలీవుడ్ డైరెక్టర్ ఈ నివాస్ ఓ ఆంగ్ల పత్రికకు తెలిపాడు. అదింకా ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉందన్నాడు. ఈ కథకు అనుష్క అయితేనే పర్‌ఫెక్ట్‌గా ఉంటుందన్న ఉద్దేశంతోనే కథ వినిపించామని చెప్పాడు నివాస్. జువైనల్ అనే టైటిల్ పెట్టామని, అది మల్టీస్టారర్ సినిమానే గానీ, రీమేక్ కాదని చెప్పాడు.
అనుష్కకు ఆఫర్ చేసింది హీరోయిన్ సెంట్రిక్ మూవీ కాదని చెప్పిన నివాస్.. ఇప్పటికిప్పుడైతే ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని చెప్పలేమంటూ వ్యాఖ్యానించాడు. అనుష్క ఇప్పుడు కేవలం దక్షిణాది స్టార్ కాదని, ఇండియన్ స్టార్ అని, ఆమెతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని, కానీ, అది మాత్రం ఇప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదని అన్నాడు నివాస్. సినిమాలో కొత్త వారి కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చాడు. అయితే.. కొత్తవారి కోసం ప్రయత్నిస్తున్నామన్న నివాస్.. సినిమాను అనుష్క ఒప్పుకోలేదా లేకపోతే వేరే ఏదైనా సమస్య వల్ల కొత్తవారిని తీసుకుంటున్నారా..? అన్నది మాత్రం చెప్పలేదు. ఏదేమైనా అనుష్క మాత్రం ఓ బాలీవుడ్ ఆఫర్‌ను చేజార్చుకున్నట్టే.