
టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం చాలా మంది హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు. ఎంత మంది కొత్త వాళ్లు వచ్చినా.. కొంత మంది తారలకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. పైగా వారి కోసమే దర్శక నిర్మాతలు కథలు తయారు చేస్తుంటారు. అలాంటి తారల్లో అనుష్క ఒకరు. కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాల్లోనూ, హీరో పక్కన ఆడిపాడే తారగానూ.. ఆమె రాణించగలదు.
కానీ.. గత కొంత కాలం క్రితంగా ఆమెకు సరైన అవకాశాలు దక్కడం లేదని టాలీవుడ్ టాక్. అందుకు ఆమె బరువే కారణమట. సైజ్ జీరో సినిమా కోసం ఆమె చాలా బరువు పెరిగింది. తరువాత తగ్గేందుకు ప్రయత్నించినా.. వరుస సినిమాల కారణంగా కుదరలేదు. ఈ కారణంగానే.. ప్రభాస్ ‘ సాహో’ చిత్రంలోనూ ఆమె అవకాశం కోల్పోయింది.
అయితే.. ఇప్పుడు అనుష్క లావుగా లేదట. బాగా బరువు తగ్గి.. మునుపటి అనుష్కలా మారిపోయిందట. హైదరాబాద్ లోని తన ఇంట్లో ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేసుకుందట ఈ యోగా టీచర్. అంతేకాదు.. ఒక ట్రైనర్ ని ఏర్పాటు చేసుకొని రోజుకి 8గంటలు శ్రమించి మరీ బరువు తగ్గిందని ఓ తమిళ మీడియా సంస్థ తెలిపింది.
తాను మునుపటిలా మారేంత వరకు ఏ సినిమా ఒప్పుకోకూడదని పట్టుదలగా కృషి చేసిందట అనుష్క. ఇటీవలే ఓ తెలుగు సినిమా దర్శకుడు ఓ సినిమా కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. అనుష్క బరువు తగ్గడం నిజమైతే.. ‘అయ్యో.. మన స్వీటీ ఇంత లావుగా అయిపోయిందేమిటి’ అని బాధపడ్డ ఆమె అభిమానులు మాత్రం ఈ వార్తతో సంబరపడిపోతారు.