
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే జయదేవ్ కొడుకు, సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ చిత్రంతో హీరోగా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో యంగ్ హీరో కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. గల్లా జయదేవ్ కుటుంబంలోని అల్లుడి వరుస అయిన మాన్యం కృష్ణ హీరోగా అలరించబోతున్నారు. గల్లా అశోక్, మాన్యం కృష్ణ ఒకే యాక్టింగ్ స్కూల్లో నటనా పాఠాలు నేర్చుకున్నారు. ప్రస్తుతం తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో మాన్యం కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జెట్టీ’(Jetty). కోస్తాంధ్ర జెట్టీల నేపథ్యంలో సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సుబ్రమణ్యం పిచుక దర్శకత్వం వహిస్తున్నారు. వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మించారు. మాన్యం కృష్ణ హీరోగా, నందితా శ్వేత (Nanditha Swetha) హీరోయిన్ గా నటించారు. శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కోవిడ్ తర్వాత రూపొందిన ఈ చిత్రం ఆలస్యంగా రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సినిమాను నవంబర్ 4న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో రిలీజ్ అవుతుందని అన్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. 2020లోనే ఒకే షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేశారు. రిలీజ్ కాస్తా ఆలస్యం అయినా... ప్రస్తుతం థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్ర ట్రైలర్ ను దర్శకుడు గోపీచంద్ మాలినేని కూడా చూసి ప్రశంసించారని తెలిపారు.
‘జెట్టి’ అంటే.. ఫిషింగ్ హార్బర్.. కోస్తాంధ్రకు జెట్టిలు ఎందుకు అవసరం? సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి అంటారు. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో కథ సాగుతుంది. కఠారిపాలెం ప్రాంతంలో ఉన్న జెట్టి ఏరియాలో సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా సన్నివేశాలు సాగుతుంటాయి. ఆ ప్రాంతంలోనే ఓ మోతుబరి ఎలా కంట్రోల్ చేస్తుంటాడు. అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే విషయంతో కథ మరింత ఆసక్తికరంగా సాగుతుందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.