ఉప్పల్‌ మ్యాచ్‌లో తప్ప తాగి వీరంగం: యాంకర్ ప్రశాంతిపై కేసు

By Siva KodatiFirst Published Apr 22, 2019, 1:16 PM IST
Highlights

ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ చూడటానికి తప్ప తాగి వచ్చిన కొందరు యువతి, యువకులు స్టేడియంలో హల్ చల్ చేశారు. 

ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ చూడటానికి తప్ప తాగి వచ్చిన కొందరు యువతి, యువకులు స్టేడియంలో హల్ చల్ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చూడటానికి ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు వచ్చారు.

అంతకు ముందే పీకల్లోతు మద్యం తాగి వచ్చిన ఆరుగురు యువతీ, యువకులు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టారు. కూర్చొని మ్యాచ్ చూడకుండా వికృత చేష్టలతో సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించారు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన విధుల్లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూర్ణిమ, ప్రశాంతి, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్ అనే యువతీ, యువకులుగా గుర్తించారు.

వీరిలో టీవీ యాంకర్ ప్రశాంతి కూడా ఉన్నారు. ఈమె పలు టీవీ ఛానెళ్లలో యాంకరింగ్ చేయడంతో పాటు సినీ ప్రముఖలును ఇంటర్వ్యూ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎఫైర్ అనే ఓ సినిమాలోనూ నటించారు. లెస్బియన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.

కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో పరిచయమున్న ఓ కార్పోరేట్ సంస్థ ఇచ్చిన వీఐపీ పాస్‌లతో ప్రశాంతి ఆమె మిత్ర బృందం వీఐపీ బాక్స్‌లోకి ప్రవేశించారు. బాక్స్ నెంబర్ 22లో మ్యాచ్‌ను తిలకిస్తున్న  వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

భరత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ ఉపాధ్యాయ్‌ను మ్యాచ్ చూడకుండా విసిగించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రశాంతి సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. 

click me!