
స్టార్ యాంకర్ అనసూయ దర్శక నిర్మాత మదన్ మరణం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షించారు. మదన్ గారి మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. నేను జర్నలిస్ట్ గా నటించిన గాయత్రి చిత్రానికి ఆయన దర్శకులు. సహనం, అర్థం చేసుకునే గుణం కలిగిన దయగల వ్యక్తి ఆయన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి... అని అనసూయ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అనసూయ ట్వీట్ వైరల్ గా మారింది.
మదన్ చివరి చిత్రం గాయత్రీ. బెంగాలీ మూవీ రీమేక్ గా ఆయన గాయత్రీ చిత్రం తెరకెక్కించారు. మోహన్ బాబు ప్రధాన పాత్ర చేశారు. ఆ మూవీలో అనసూయ కీలక రోల్ చేయడం జరిగింది. కాగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ఆ నలుగురు' చిత్రానికి మదన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. జగపతి బాబు హీరోగా విడుదలైన పెళ్ళైన కొత్తలో చిత్రంతో దర్శకుడిగా మారారు. గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, గరం చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా పనిచేశారు. నిర్మాతగా కూడా ఒకటి రెండు చిత్రాలు నిర్మించారు.
మదన్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కి గురైనట్లు సమాచారం. అనారోగ్యంతో ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు ఝామున కన్నుమూశారు. మదన మృతికి చిత్ర ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.