
తెలుగు నటి అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకుంది. వకీల్ సాబ్ చిత్రంలో కీలకమైన దివ్యా నాయక్ పాత్రలో నటించి మెప్పించింది. అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ యువతని ఆకర్షిస్తూ ఉంటుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనన్య నాగళ్ళ తన పర్సనల్ లైఫ్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తాను ప్రేమలో మోసపోయానని, లవ్ బ్రేకప్ జరిగిందని రివీల్ చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాకే ప్రేమలో పడ్డాను అని, బ్రేకప్ కూడా జరిగిందని అనన్య నాగళ్ళ తెలిపింది. బ్రేకప్ జరిగినప్పుడు తీవ్రమైన మానసిక వేదన అనుభవించా. కానీ ఆ ప్రభావం నా కెరీర్ పై పడనివ్వలేదు.
డిప్రెషన్ కారణంగా నా మనసుకు, మెదడుకు, చేస్తున్న పనులకు సంబంధం లేకుండా ఉండేది. కొన్నిసార్లు అతనికి తెలియకుండానే ఫోన్ చేసేదాన్ని. ఇంత జరిగినా కూడా అతనికి ఎందుకు ఫోన్ చేస్తున్నానో కూడా అర్థం అయ్యేది కాదు. ఈ ప్రభావం కెరియర్ పై పడకుండా జాగ్రత్త పడ్డాను. రాత్రంతా ఏడ్చేదాన్ని.. ఉదయాన్నే జిమ్ కి వెళ్ళేదాన్ని. షూటింగ్ లో ఉన్నప్పుడు కేరవాన్ లో వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని. కళ్ళు తుడుచుకుని బయటికి వచ్చి కెమెరా ముందు నటించేదాన్ని అని అనన్య ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
అయితే తన ప్రియుడు ఎవరనేది మాత్రం బయట పెట్టలేదు. టాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా తక్కువ. సాధారణంగా నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లు బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఆ తర్వాత వాళ్లకు మరిన్ని అవకాశాలు వస్తాయి. అదే తెలుగు హీరోయిన్ కి బ్లాక్ బస్టర్ హిట్ పడితే..నార్త్ వాళ్లకు వచ్చిన అన్ని అవకాశాలు రావు.
సినిమా ఇండస్ట్రీ అంటేనే బిజినెస్. ఎవరికైనా హిట్స్ వస్తేనే మార్కెట్ పెరుగుతుంది. బేబీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య కి అవకాశాలు పెరిగాయి. కానీ బయట హీరోయిన్లకు ఉన్నంత ప్రాధాన్యత తెలుగు హీరోయిన్లకు ఉండడం లేదు. నా విషయానికి వస్తే హిట్ చిత్రాలు ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. అది గమనించినప్పటి నుంచి నా కోసం నేను పబ్లిసిటీ పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు అనన్య పేర్కొంది.
అనన్య నాగళ్ళ మల్లేశం చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. వకీల్ సాబ్, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, తంత్ర, పొట్టేల్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా అనన్య నటిస్తోంది.
అనన్య కెరీర్ లో వివాదాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆమె బెట్టింగ్ యాప్ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత అనన్య తన తప్పును అంగీకరించింది. తను ఒకే ఒక్క బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేశానని మీడియా ముందు తెలిపింది. ఆ ప్రమోషనల్ వీడియోకి గాను తాను లక్ష ఇరవై వేలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలిపింది.
ఆ తర్వాత ఇది తప్పు అని అర్థం అయ్యాక.. బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయిన వారికి ఆ డబ్బును తిరిగి ఇచ్చేసినట్లు అనన్య నాగళ్ళ పేర్కొంది. బెట్టింగ్ యాప్ వివాదంలో అనన్య నాగళ్ళ తో పాటు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, శివజ్యోతి, సుప్రీత లాంటి వారి పేర్లు వినిపించాయి.
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి కూడా అనన్య నాగళ్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. చిన్న చిన్న సమస్యలు ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. ఒక దాన్ని పట్టుకుని ఏదో జరిగిపోతుంది అని ఊహించుకోవడం తప్పు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ కి ఒప్పుకుంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు.. లేకుంటే తక్కువ ఇస్తారు అనే టాక్ ఉంది. ఇది నిజమా అని ఓ మీడియా ప్రతినిధి అనన్యని ప్రశ్నించారు. దీంతో అనన్య నాగళ్ళ సదరు జర్నలిస్టుకి కౌంటర్ ఇచ్చింది. అలా జరుగుతుందని అంత కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు.. దీని గురించి మీకు ఎలా తెలుసు అని అనన్య ప్రశ్నించింది.
మీరు ఏదో ఊహించుకున్నట్లు ఇక్కడ జరగడం లేదు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే వేరే అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉండదు అని అనన్య పేర్కొంది. ఆమె అడిగిన ప్రశ్నతో నా ఇన్నేళ్ల కష్టం మొత్తం వృధా అయింది. ఇంట్లో నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. మా అమ్మకి నచ్చచెప్పి వచ్చాను. ఇంటి నుంచి వస్తున్న ప్రతి రోజు ఏమీ కాదు అమ్మా అంతా మంచే జరుగుతుంది అని చెబుతూ వస్తున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి పరువు తీశాను అంటూ మా బంధువులు ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ మాటల వల్ల నేను కూడా అదే విధంగా హీరోయిన్ అయ్యాను అని వాళ్ళు తప్పుగా అనుకుంటారు. మా అమ్మని అడుగుతారు.
ఇన్ని రోజులు ఇండస్ట్రీలో నాకు వస్తున్న పేరు చూసి మా అమ్మ ఆనందపడేది. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నతో ఆ ఆనందం మొత్తం పోయింది. నా ఇన్నేళ్ల కష్టం వృధా అయింది అంటూ అనన్య నాగళ్ళ భావోద్వేగానికి గురైంది.