వీధికుక్కల దాడితో ప్రాణాలు కోల్పోయిన బాలుడి ఘటనపై అక్కినేని అమల స్పందించినట్టు తెలుస్తోంది. కుక్కలను శత్రువులుగా చూడొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వీధికుక్కల దాడిలో నాలుగేండ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో చేరడంతో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు బాలుడి మరణం పట్ల చింతిస్తున్నారు. అదే క్రమంలో పట్టణంలో వీధి కుక్కలను పారద్రోలేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఆర్జీవీ కూడా సోషల్ మీడియాలో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే.. జంతు ప్రేమికులు మాత్రం కుక్కలపై దయ చూపాలనే కోరుతున్నారు.
ఇప్పటికే యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా నటి, బ్లూ క్రాస్ సోసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకులు రాలు అక్కినేని అమల (Akkineni Amala) కూడా స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. అంబర్ పేటలో కుక్కల దాడితో బాలుడు మరణించడం చాలా బాధాకరం. అలాగని మొత్తం కుక్కలపై కోపం, ద్వేషం పెంచుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. వాటిని ఎంతగా ప్రేమిస్తే అవి కూడా తిరిగి ప్రేమిస్తాయని అన్నారు. ప్రస్తుతం కుక్కలన్నింటినీ పారద్రోలినా మళ్లీ జనావాసంలోకి వచ్చే అవకాశం ఉందని, మానవులకు వాటికి మధ్య వేల ఏండ్లనాటి అనుబంధం ఉందన్నారు. కానీ వాటి సంతానం పెరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే సరిపోతుందని అన్నట్టు తెలుస్తోంది.
అమల స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. బాలుడిపై దాడి చేసిన కుక్కలను ఎలా ప్రేమించమంటారు? మీ ఇంట్లో వారికి జరిగితే ఇలాంటి స్టేమ్ మెంట్స్ ఇస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరీ నాలుగేండ్ల బాలుడి విషయంలో ఇలా స్పందించడం ఏం బాగోలేదంటూ అభిప్రాయపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం అమలు చెప్పిన మాటలను కాస్తా ప్రశాంతంగా ఆలోచించాలని అంటున్నారు. ఆ విషాద ఘటనను సమర్థించడం ఆమె ఉద్దేశం కాదని, జంతు సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటే సరిపోతుందని అంటున్నారన్నారు.