
ఇంగ్లీష్ లిటరేచర్ లో రాబిన్ హుడ్ ఓ కల్పిత పాత్ర. 17వ శతాబ్దంలో పెద్దోళ్లను దోచి పేదలకు పెట్టిన గజదొంగ కథ. రాబిన్ హుడ్ కథలు వందల చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఆ తరహా కథలు ప్రేక్షకులను అలరించాయి. ఇది ఎవర్ గ్రీన్ మాస్ కమర్షియల్ సబ్జెక్టు. ఎక్కువ సందర్భాల్లో మేకర్స్ కి విజయాలు దక్కాయి. దొంగతనం క్రైమ్ అయినప్పటికీ అది పేదలకు పంచడం అనే మంచితనం ఆడియన్స్ ని ఆకర్షిస్తుంది.
పుష్ప మూవీలో దర్శకుడు సుకుమార్ ఓ స్మగ్లర్ కథ చెప్పాలనుకున్నాడు. తక్కువ జాతికి చెందిన పుష్పరాజ్ చిన్నప్పటి నుండి వివక్షత ఎదుర్కొంటాడు. అణచివేతకు గురవుతాడు. ఆర్థికంగా, సామాజికంగా తాను కోల్పోయిన దాన్ని ఎలాగైనా పొందాలనుకుంటాడు. పుష్ప పార్ట్ 1 ఇదే కోణంలో సాగుతుంది. సుకుమార్ పుష్ప క్యారెక్టర్ లో ఎక్కడా సామాజిక కోణం చూపించలేదు. ఇతరులకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పే ఒక్క సీన్ లేదు.
ఇదే సుకుమార్ ని విమర్శలకు గురి చేసింది. గరికపాటి లాంటి వాళ్ళు ఒక స్మగ్లర్ కథను హీరోయిక్ గా చెప్పడం ఎంత వరకు సమంజసం? నేరస్థుడి చేత తగ్గేదేలే అని చెప్పించడం సబబేనా? అని విమర్శించారు. అలాగే ఒక స్మగ్లర్ కథను సుకుమార్ ఎలా ముగిస్తాడనే సందిగ్ధత కూడా ఏర్పడింది. హీరోని సినిమా మొత్తం విలన్ గా చూపించినా ఏదో ఒక కారణం చెప్పి... హీరోని చేయాలి. లేదంటే ఇండియన్ ఆడియన్స్ హర్షించరు.
కెజిఎఫ్ సిరీస్ తీసుకుంటే ప్రశాంత్ నీల్ అదే చేశాడు. సినిమా మొత్తం రాకీ భాయ్ లక్ష్యం ఒకటే. అతనికి దయా దాక్షిణ్యాలు ఉండవు. తన లక్ష్యం కోసం పెద్దల తలల నరుకుతూ పోతాడు. కెజిఎఫ్ దక్కించుకున్నాక కూడా అతనిలో ఎలాంటి మార్పు ఉండదు. కార్మికుల చేత గొడ్డు చాకిరీ చేయించి బంగారం వెలికితీస్తాడు. కానీ ఫైనల్ లో కార్మికులకు మంచి చేసి పోతాడు. వాళ్ల అవసరాలు నెరవేరుస్తాడు. అలా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో హీరోయిజం చూపించారు.
సుకుమార్ పుష్ప పార్ట్ 2 లో హీరోని పూర్తిగా ఇండియన్ రాబిన్ హుడ్ చేసేశాడు. విడుదలైన టీజర్ తో ఇది స్పష్టమైంది. కాకపోతే పుష్ప దొంగ కాదు. ఎర్రచందనం స్మగ్లర్. అక్రమంగా సంపాదించిన డబ్బులతో పేదల అవసరాలు తీరుస్తాడు. ఇలా చేయడం ద్వారా పుష్ప కథ రొటీన్ అయిపోయింది. అలా కాకుండా వేరేలా చెప్పడం కూడా సాహసమే. ప్రేక్షకులను మెప్పించే గొప్ప లాజిక్ తో ముగించాలి. అందుకే సుకుమార్ ఈజీ కంక్లూషన్ ఎంచుకున్నారు.
సిండికేట్ ని హస్తగతం చేసుకున్న పుష్ప డాన్ గా ఎదుగుతాడు. అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని పేదలకు పంచుతాడు. మొత్తంగా కథ ఇది. ఇక సినిమాలో ట్విస్ట్స్ అంటూ చెప్పుకుంటే... కేశవ ఏమయ్యాడు? పుష్పతోనే ఉన్నాడా? మాఫియా కింగ్ గా ఎదిగిన పుష్ప జైలుపాలు ఎలా అయ్యాడు? అతన్ని ఎవరైనా ఇరికించారా? చివరికి పుష్ప ఏమయ్యాడు? స్మగ్లర్ గానే అతని క్యారెక్టర్ ముగిస్తారా? లేదంటే తన లక్ష్యం నెరవేరిందని స్మగ్లింగ్ వదిలేస్తాడా?. ఏది ఏమైనా టీజర్ అంచనాలు పెంచేయగా మూవీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.