
టాలీవుడ్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్లదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటవల ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు సినిమాకి ఏడు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీ నుంచి కనీసం సత్కారం లేదని అల్లుఅరవింద్ అన్నారు. ఇండస్ట్రీ గుర్తించడానికి ముందే సైమా గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. తాజాగా గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో `సైమా 2025` ఈవెంట్ జరిగింది. త్వరలో దుబాయ్‌లో ఈ అవార్డు వేడుక జరగబోతుంది.
ఈ క్రమంలో ఆ అవార్డు వేడుకలను అడ్రెస్ చేస్తూ జాతీయ అవార్డులను గెలుచుకున్న విన్నర్స్ ని సైమా తాజాగా సత్కరించింది. ఇందులో నిర్మాత అల్లు అరవింద్, హీరో సందీప్ కిషన్, మంచు లక్ష్మీ, ఫరియా అబ్దుల్లా, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ తోపాటు జాతీయ అవార్డు విన్నర్స్ పాల్గొన్నారు. విన్నర్స్ ని అల్లు అరవింద్ షీల్డ్ లతో సత్కరించారు.
ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, 13ఏళ్లుగా ఈ సైమా అవార్డులను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. అదే సమయంలో తెలుగు సినిమాకి ఏడు జాతీయ అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ``మన తెలుగులో కల్చర్ కొద్దిగా తక్కువైంది. ఏడు అవార్డులు తెలుగు సినిమాలకు వచ్చాయి. ఆ అవార్డులకు సంబంధించి ఇండస్ట్రీ స్పందించకముందే, వారిని సైమా గుర్తించి వారందరిని ఒక వేదికపైగా తీసుకొచ్చి సత్కరించడం అభినందనీయం. విన్నర్స్ కి అభినందనలు. జాతీయ అవార్డుల్లో రెండు కేటగిరిలో జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. దీన్ని మనం ఒక పండగలా జరుపుకోవాలి. ఇండస్ట్రీలో మీకు తెలిసిందే, ఇక్కడ ఎవరి కుంపటి వాళ్లదే, అందుకే మంచి పనులు చేయలేకపోతున్నాం`` అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది.
అల్లు అర్జున్ కి రెండేళ్ల క్రితం `పుష్ప` చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. ఆ సమయంలోనే తెలుగులోకి సుమారు పది కేటగిరిలో జాతీయ అవార్డులు వచ్చాయి. కానీ ఇండస్ట్రీ నుంచి స్పందన లేదు. వారికి సత్కారం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అరవింద్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇక 2023కిగానూ ఇటీవల ప్రకటించిన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా `భగవంత్ కేసరి`కి, అలాగే `బలగం` చిత్రంలోని ఊరు పల్లెటూరు పాటని రాసిన కాసర్ల శ్యామ్‌కి బెస్ట్ రిలిక్ రైటర్‌గా, `హనుమాన్` చిత్రానికిగానూ యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా నందు, పృథ్వీలకు, `బేబీ` మూవీకిగానూ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గా సాయి రాజేష్‌కి, `బేబీ` సినిమాలో `ప్రేమిస్తున్నా` పాటని పాడిన పీవీఎన్ ఎస్ రోహిత్‌కి బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా, `గాంధీతాత చెట్టు` చిత్రానికి గానూ ఉత్తమ బాలనటిగా సుకృతి వేణికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరిలో జాతీయ అవార్డు వరించిన విషయం తెలిసిందే.