
అల్లరి నరేష్ కామెడీ జోనర్ నుంచి సైడ్ ట్రాక్ తీసుకుని ఇప్పుడు మాస్, ఇంటెన్స్ యాక్షన్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇప్పటికే `నాంది` చిత్రంతో మెప్పించారు. అలాగే `ఇట్లు మారెడుమిల్లి` చిత్రంతోనూ ప్రయోగం చేశాడు. ఇప్పుడు `నాంది` కాంబినేషన్‌లో `ఉగ్రం` చిత్రంతో వస్తున్నారు. ఈ సినిమా టీజర్ బుధవారం విడుదల చేశారు. ఆద్యంతం ఇంటెన్స్ యాక్షన్‌గా సాగే ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. టైటిల్ తగ్గ కంటెంట్ కనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా అల్లరి నరేష్ నయా లుక్ అదరగొడుతుంది.
ఇదిలా ఉంటే ఈ సందర్భంగా ఈ సినిమాకి వర్క్ చేయడంపై నరేష్ స్పందిస్తూ, సినిమా చాలా వరకు నైట్ టైమ్‌లోనే సాగుతుందని, రాత్రిళ్లు మమ్మల్ని దర్శకుడు టార్చర్ చేశారని(నవ్వుతూ) చెప్పారు. `నాంది` సినిమాకి నా బెండు తీశాడని, ఈ సినిమాకి నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడని చెప్పారు నరేష్. సినిమా కోసం రోజూ దాదాపు 12గంటలు పనిచేశామన్నారు. `నాంది`ని మించి ఉంటుందన్నారు. అదే సమయంలో ఇందులో ఆ సినిమా తరహాలోనే చివర్లో చిన్న సందేశం ఉంటుందని, సోషల్ ఎలిమెంట్ ని చర్చంచామన్నారు దర్శకుడు.
ఇదిలా ఉంటే నాగార్జునతో అల్లరి నరేష్ సినిమా చేయబోతున్నారనే ప్రచారంజరుగుతుంది. ప్రముఖ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకుడిగా మారి నాగార్జున హీరోగా ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు. వినోదం, కమర్షియల్ అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని, సెకండ్ లీడ్‌గా కనిపిస్తారని టాక్ నడుస్తుంది. తాజాగా `ఉగ్రం` టీజర్ ఈవెంట్‌లో అల్లరి నరేష్ స్పందించారు. ఆ సినిమా ఉంటుందన్నారు. అయితే కథ విన్నానని, చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు.
అయితే ప్రస్తుతం కథ విన్నానని, ఇంకా సైన్ చేయలేదన్నారు. అన్ని చూసుకుని చెబుతామని, రెమ్యూనరేషన్స్ లాంటివన్నీ ముట్టాక టీమే తెలియజేస్తుందన్నారు. ఆల్మోస్ట్ ఈ సినిమా ఉండబోతుందనే అభిప్రాయాన్ని అల్లరి నరేష్ వెల్లడించారు. దీంతోపాటు `నాంది` సీక్వెల్ కూడా ఉంటుందన్నారు. ఇక `ఉగ్రం` చిత్రంలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తుండగా, విజయ్ కనకమేడట దర్శకత్వం వహిస్తున్నారు. నరేష్‌కి జోడీగా మిర్నా హీరోయిన్‌గా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో సినిమా విడుదల కాబోతుంది.