
`ఆదిపురుష్` సినిమా హిందూ మతాన్ని కించపరిచేది ఉందంటూ, సినిమాని బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్‌ని అలహాబాద్ హైకోర్ట్ బుధవారం విచారించింది. మంగళవారం విచారణలో కోర్టుకి `ఆదిపురుష్` నిర్మాత,రైటర్ హాజరు కాకపోవడంపై సీరియస్ అయ్యింది. తాజాగా నేడు జరిగిన విచారణలో కోర్ట్ `ఆదిపురుష్` టీమ్‌పై సీరియస్ అయ్యింది. సెన్సార్ బోర్డ్ తో సహా అందరికి మొట్టికాయలు వేసింది. సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
`ఆదిపురుష్` సినిమాలో హిందూ మతాన్ని, రామాయణాన్ని తప్పుగా చూపించారనే పిటిషన్‌పై కోర్టు విచారిస్తూ.. మతాల జోలికి ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరించింది. మీరు ఖురాన్, బైబిల్‌ని ముట్టుకోకూడదు, ఏ మతాలను ముట్టుకోకూడదని, వాటిని తప్పుగా చూపించవద్దని హెచ్చరించింది. కోర్టుకి మతం లేదని, రాజేష్ సింగ్ చౌహాన్,ప్రకాష్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మతపరమైన గ్రంథాలకు దూరంగా ఉండాలని, వాటిపై సినిమాలు తీయోద్దని పేర్కొంది. ఈ సందర్భంగా ఉదాహరణంగా ఓ విషయం చెబుతూ, మీరు ఖురాన్‌పై డాక్యుమెంటరీని తప్పుగా తీసి, తర్వాత ఏం జరుగుతుందో చూడండి` అంటూ పరోక్ష హెచ్చరికలు చేసింది.
సామాజిక సామరస్యానికి భంగం కలిగించేలా ఏదో ఒక పని నిరంతరం జరుగుతోందని హైకోర్ట్ చెప్పింది. నిర్మాత కోర్టు కి హాజరు కాకపోవడం పట్ల ఇదేం జోక్ కాదని, నిర్మాత కోర్టుకి హాజరు కావాల్సిందే అని స్పష్టం చేసింది. రామాయణంలో అనేక పాత్రలను పూజిస్తారు, వాటిని సినిమాలో ఎలా చిత్రీకరించారు అని కోర్టు పేర్కొంది. మరోవైపు సినిమా నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్లకు ప్రతిస్పందనగా వ్యక్తిగత అఫిడవిట్లను సమర్పించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని కోర్టు ఆదేశించింది.
ఇక అంతకు ముందు జరిగిన విచారణలో సెన్సార్ కు పంపిన సమయంలో ఇలాంటి డైలాగ్స్ ను ఎందుకు సమర్థించారని కోర్టు ప్రశ్నించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సన్నివేశాల వల్ల భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశాలను అందించాలనుకుంటున్నారని మేకర్స్ పై కోర్ట్ సీరియస్ అయ్యింది.
ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహాన్, దేవదత్తా ప్రధాన పాత్రల్లో నటించిన `ఆదిపురుష్` సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్ నిర్మించింది. జూన్ 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. పది రోజుల్లో ఈ సినిమా 450కోట్లు రాబట్టింది. ఇంకా థియేటర్లలో రన్ అవుతుంది. అయితే బడ్జెట్ వైజ్‌గా, బిజినెస్ పరంగా సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది.