పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ జగన్నాథ్ హీరోగా తల్వార్` సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. అలాగే కిరణ్ అబ్బవరం `క` నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది.
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ ఇటీవలే పేరు మార్చుకున్నాడు. ఆకాష్ జగన్నాథ్ గా ఆయన పేరుని మార్చుకున్నాడు. ఇక ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నాడు. `తల్వార్` పేరుతో సినిమా చేస్తున్నాడు. దీన్ని సోమవారం రాఖీ పండుగ సందర్భంగా ప్రారంభించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అదిరిపోయేలా ఉంది. ఆకాష్ మాస్ లుక్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఈ సారి భారీ మాస్ సినిమాతో కొట్టేందుకు వస్తున్నట్టు తాజా లుక్ చూస్తుంటే తెలుస్తుంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవంలో రైటర్ విజయేంద్రప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, హీరో కార్తికేయ స్క్రిప్ట్ హ్యాండోవర్ చేశారు. డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించబోతున్నారు. వారి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇక సినిమాని వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ రూపొందిస్తున్నారు.
కిరణ్ అబ్బవరం `క` సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అదిరిపోయింది..
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా క`. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాట హీరో కిరణ్ అబ్బవరం వాసుదేవ్ క్యారెక్టరైజేషన్ ను ఆవిష్కరించింది. 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా సామ్ సీఎస్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు. 'ఏ మొదలు తుదలు లేని ప్రయాణం. ఏ అలుపూ సొలుపు లేని విహారం. ఏ చెరలు తెరలు తెలియని పాదం.. ఈ మజిలీ ఒడిలో ఒదిగిన వైనం,నిన్న మొన్న ఉన్న నన్ను చూశారా..వెన్ను దన్ను అంటూ ఏముంది. ఒంటరివాడినని అంటారా నాతో పాటు ఊరుంది...' అంటూ హీరో వాసుదేవ్ పాత్రను ప్రతిబింబిస్తూ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' ఆద్యంతం కట్టిపడేస్తుంది.
`క` సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో "క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.