
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం క్షణాల్లో కుప్పకూలిపోవడం దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని డిజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) వెల్లడించింది. ఈ విమానం లండన్ వెళ్లాల్సి ఉండగా, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది.
విమానంలో మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం తర్వాత ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ఈ సంఘటన గురించి స్పందిస్తూ తమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్, అనసూయ, మంచు విష్ణు, అక్షయ్ కుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, శోభిత ధూళిపాల, కరీనా కపూర్ లాంటి సెలెబ్రిటీలు ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
అలియా భట్
"ఇది భయానక ఘటన. నా హృదయం విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది కోసం ప్రార్థిస్తోంది." అని అలియా భట్ పేర్కొన్నారు.
అక్షయ్ కుమార్
"ఈ వార్త విని మాటలు రావడంలేదు. ప్రార్థనలు మాత్రమే నా చేతిలో ఉన్నాయి" అని అక్షయ్ కుమార్ X వేదికగా తెలిపారు.
అల్లు అర్జున్
టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ, "అహ్మదాబాద్ విమాన ప్రమాదం వార్త విని హృదయం బద్దలైంది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి." అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ కూడా "ఇది నిజంగా బాధాకరం. బాధితుల కుటుంబాలకు శక్తి కలగాలని ప్రార్థిస్తున్నా" అని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, “ఈ దుర్ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. ప్రయాణికుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కోసం ప్రార్థిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.
కన్నప్ప ట్రైలర్ వాయిదా
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి గురించి తెలుసుకున్నప్పుడు నా హృదయం పగిలిపోయింది. ఈ విషాద సమయంలో, మేము కన్నప్ప ట్రైలర్ విడుదలను ఒక రోజు పాటు వాయిదా వేస్తున్నాం. అలాగే రేపు ఇండోర్‌లో జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నాం. ఈ అత్యంత కష్టతర సమయంలో బాధితుల కుటుంబాలకు నా ప్రార్థనలు అని మంచు విష్ణు పేర్కొన్నారు.
అనసూయ
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నా హృదయం బద్దలయ్యేలా చేసింది. ప్రమాదానికి గురైన బాధితులు త్వరగా కోలుకోవాలి అని ప్రార్థిస్తున్నా అంటూ అనసూయ పోస్ట్ చేసింది.
రాంచరణ్
అహ్మదాబాద్‌లో జరిగిన ఈ దురదృష్టకరమైన విమాన ప్రమాదం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది, ప్రభావితులందరికీ, వారి కుటుంబాలకు నా ప్రార్థనలు అని రాంచరణ్ ట్వీట్ చేశారు.
చిరంజీవి
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఫ్లైట్ AI171 కు సంబంధించిన భయంకరమైన విషాద ఘటన గురించి వినగానే నా మనస్సు చలించిపోయింది. ఇది ఎంతటి విషాదమో చెప్పడానికి మాటలు సరిపోవు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి,ప్రార్థనలు. వారి ఆత్మలకు శాంతి కలగాలి అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ప్రస్తుతం దేశం మొత్తం ఈ విషాద సంఘటనపై దిగ్భ్రాంతితో ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.