
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించినందుకు చిత్ర టీమ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని దేశం నలు మూలల నుండి డిమాండ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన అనేక విషయాల్లో సినీ ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. హనుమంతుడి సంభాషణలు. ఓ సన్నివేశంలో ఇంద్రజిత్తుతో హనుమాన్ చెప్పే డైలాగ్స్.. అంతటా చర్చకు దారి తీశాయి. ఆ సంభాషణలను తప్పుబడుతూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలోనూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం హనుమంతుడు చెప్పే డైలాగ్స్ ని మార్చారు.
ఆదిపురుష్ సినిమా హిందీ వెర్షన్‌లో లంకా దహనం సందర్భంగా హనుమంతుడు ఇంద్రజిత్తుతో చెప్పే డైలాగులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘కప్డా తేరీ బాప్ కా, తేల్ తేరీ బాప్ కా, అగ్ బీ తేరీ బాప్ కా, జలేగీ బీ తేరి బాప్ హై’ (వస్త్రం నీ బాబుదే, నూనె నీ బాబుదే, నిప్పు నీ బాబుదే, ఇప్పుడు తగులబడేది కూడా నీ బాబే) అని హనుమంతుడి చేత ఇంద్రజిత్తుకు చెప్పించడాన్ని అనేక మంది తప్పుపట్టారు.
దాంతో ఆ డైలాగులను ఇప్పుడు మార్చేశారు. ‘కప్డా తేరీ లంకా కా, తేల్ తేరీ లంకా కా, అగ్ బీ తేరీ లంకా కా, జలేగీ బీ తేరి లంకా హై’ (వస్త్రం నీ లంకదే, నూనె నీ లంకదే, నిప్పు నీ లంకదే, ఇప్పుడు తగులబడేది కూడా నీ లంకే) అని సవరించారు. ఈ సవరించిన డైలాగులతో ఉన్న ఓ వీడియో ఇప్పుడు ట్విటర్‌లో చక్కెర్లు కొడుతోంది. కింది వీడియోలో మీరు మార్చిన డైలాగులను వినవచ్చు.
అసలు డైలాగ్ కాకుండా.. కేవలం పదాన్ని మాత్రం లంక పేరుతో మార్చడం చర్చనీయాంశం అయింది. అయితే, కేవలం పదాన్ని మాత్రం మారిస్తే సరిపోదుగా..అని నెటిజన్లు సోషల్ మీడియా లో రెట్టింపు కామెంట్స్ చేస్తున్నారు.
మనోజ్ ముంతాషిర్ మాట్లాడుతూ... ‘‘హనుమాన్ సంభాషణలు తప్పుగా రాయలేదు. నిశితంగా ఆలోచించాకే డైలాగ్స్ రాశా. సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. అందరూ ఒకేలా మాట్లాడరు కదా. పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడం కోసమే డైలాగ్స్‌ను సరళీకరించాను’’ అన్నారు. చర్చకు దారి తీసిన హనుమాన్ డైలాగ్ గురించి స్పందిస్తూ.. ‘‘అలాంటి డైలాగ్స్ రాసిన మొదటి వ్యక్తిని నేను కాదు. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కథావాచక్ (జానపద కళాకారులు)లు ‘రామాయణం’ను వివరించేటప్పుడు హనుమంతుడి సంభాషణలను ఇలాగే చెప్పేవారు. వాటినే నేను సినిమాలోకి తీసుకున్నాను’’ అని ఆయన తెలిపారు.