
నటి ప్రియాంక మోహన్‌కు ఓ పెద్ద బాధ్యత దక్కింది. దక్షిణ కొరియా టూరిజానికి గౌరవ రాయబారిగా (హానరరీ అంబాసిడర్) ఆమెను నియమించారు. కొరియా టూరిజం ఆర్గనైజేషన్ (KTO) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
ఈ నియామకం పట్ల ప్రియాంక తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొరియా ప్రభుత్వానికి, KTOకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. భారతీయ ప్రేక్షకులకు కొరియన్ సంస్కృతిని దగ్గర చేసే ఈ అవకాశం రావడం చాలా గర్వంగా ఉందని ఆమె అన్నారు.
ఈ అంతర్జాతీయ గుర్తింపు ప్రియాంక మోహన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పొచ్చు. కాగా, ప్రియాంక మోహన్ నటించిన 'మేడ్ ఇన్ కొరియా' అనే సినిమా 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చింది. రా కార్తీక్ రచన, దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామాలో ప్రియాంక.. తమిళనాడు నుంచి కొరియా వెళ్లిన షెన్బా అనే అమ్మాయి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'మేడ్ ఇన్ కొరియా' అనే సౌత్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హృదయానికి హత్తుకునే కథ, విభిన్న సంస్కృతుల నేపథ్యంతో ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో హీరోయిన్ ప్రియాంక మోహన్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది.
ఈమధ్య కొరియా అధ్యక్షుడు ఇండియాలో పర్యటించినప్పుడు కూడా ప్రియాంక కు అరుదైన అవకాశం లభించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌కు రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారితో పాటు 'మేడ్ ఇన్ కొరియా' చిత్ర బృందానికి కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది.
ఈ విందు గురించి ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో స్పందించారు. 'రాష్ట్రపతి భవన్‌లో అద్భుతమైన సాయంత్రం. గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారు, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ గారి సమక్షంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను' అని ఆమె రాసుకొచ్చారు.