
తమిళ స్టార్ హీరో శింబు కారు ప్రమాదానికి కారణమైంది. ఆయన కారు.. ఓ 70ఏళ్ల వృద్ధుడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో సదరు వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఈ సంఘటన గత శుక్రవారమే చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. పోలీసులు కారు డ్రైవర్ ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత రోజే కారు నడిపిన డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు.
చనిపోయిన వృద్ధుడు.. మునిస్వామిగా గుర్తించారు. మార్చి 18వ తేద రాత్రి 7గంటల సమయంలో ఎలాంగో సలై-పోస్ రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది. సదరు వృద్ధుడు కారు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.
కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో.. కారులో శింబు తండ్రి డైరెక్టర్, నటుడు రాజేందర్ కూడా ఉన్నారట. ఆయన ప్రమాదం జరిగిన వెంటనే వృద్ధుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ ని కూడా పిలిపించాడు. అయితే.. అంబులెన్స్ చేరుకునేలోపు సదరు వృద్ధుడు మునిస్వామి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. చనిపోయిన వృద్ధుడు వికాలాంగుడని.. అందుకే.. అతను రోడ్డుపై పాకుకుంటూ వెళ్లేది డ్రైవర్ కి కనపడలేదని వారు చెబుతున్నారు.
పాండి బజార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు మొదట్లో IPC సెక్షన్ 337 (ఏదైనా ఆవేశంగా మరియు నిర్లక్ష్యంగా చేయడం ద్వారా ఒక వ్యక్తికి హాని కలిగించడం) 279 (అనగా డ్రైవింగ్ లేదా బహిరంగ మార్గంలో రైడింగ్) కింద శిక్షార్హమైన నేరాలకు కేసు నమోదు చేశారు. తరువాత, వారు IPC 304 (A) (నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల సంభవించిన మరణం) గా కేసును మార్చారు. డ్రైవర్ సెల్వంను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.
సమీపంలోని కొన్ని నివాసాలు ,దుకాణాల్లోని CCTV కెమెరాల నుండి సేకరించిన ఫుటేజీని పోలీసులు తనిఖీ చేశారు. కాగా.. మృతుడు
మునుసామి పేవ్‌మెంట్ నివాసి అని, అతను సుమారు 15 సంవత్సరాలుగా పొరుగున చిన్నపాటి ఉద్యోగాలు చేసేవాడని దర్యాప్తు అధికారి తెలిపారు. ఇటీవల మ్యాన్‌హోల్ మూటను ఎత్తే సమయంలో కాలికి గాయం కావడంతో నడవలేకపోతున్నాడని... రోడ్డు మీద పాకుతూ వెళ్తుంటాడని వారు చెప్పారు.