చిత్ర పరిశ్రమలో విషాదం.. నటుడు శ్రీనివాస్ అకాలమరణం!

By Sambi ReddyFirst Published Jan 20, 2022, 8:00 AM IST
Highlights

చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నటుడు కొండాచ శ్రీనివాస్ అకాల మరణం పొందారు. సంక్రాంతి వేడుకల కోసం సొంతూరు వెళ్లిన శ్రీనివాస్ అక్కడే తుదిశ్వాస విడిచారు. 

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన కొండాచ శ్రీనివాస్ (Kondacha Srinivas)చాలా కాలంగా చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాడు. కొన్ని రకాల పాత్రలకు శ్రీనివాస్ ని దర్శకులు ప్రత్యేకంగా సంప్రదించేవారు. కాగా నిన్న బుధవారం తన సొంత ఊరు కాశీబుగ్గలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. హృదయ సంబంధిత సమస్యతో ఆయన మరణించినట్లు సమాచారం. కాశీ బుగ్గ బస్టాండ్‌కు దగ్గరలో తల్లితో పాటు శ్రీనివాస్ నివాసం ఉంటున్నారు.  46ఏళ్ల  శ్రీనివాస్‌ సుమారు 40కి పైగా సినిమాలు, పది టీవీ సీరియల్స్‌ వరకూ నటించారు.

ఆది, శంకర్‌దాదా ఎంబీబీఎస్, ప్రేమకావాలి, ఆ ఇంట్లో వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.ప్రతి సంక్రాంతికి కాశీబుగ్గలోని తన స్వగృహానికి రావడం, తల్లిదండ్రులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆయనకు అలవాటు. గతంలో షూటింగ్‌ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ తగిలిందని, తర్వాత అతనికి గుండెలో సమస్య ఉన్నట్లు తెలిసిందని, ఆ కారణంగానే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. 

శ్రీనివాస్‌కు అమ్మ విజయలక్ష్మి ఉన్నారు. తండ్రి ఐదేళ్ల కిందట చనిపోగా, తమ్ముడు పదేళ్ల కిందట మరణించారు. ఇద్దరు అక్కచెల్లెళ్లు అత్తా రిళ్లలో ఉన్నారు. శ్రీను మరణంతో జంట పట్టణాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కొడుకులు ఒకరి తర్వాత ఒకరు మరణించడం తల్లి విజయలక్ష్మిని శోకసముద్రంలోకి నెట్టివేసింది. దీనితో కాశీబుగ్గలో విషాద ఛాయలు అలముకున్నాయి. మిత్రులు, బంధువులు శ్రీనివాస్ అకాలమరణం పై విచారం వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!