
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి తో కరాటే కళ్యాణి (Karate Kalyani)వివాదం ఎంత పెద్ద రచ్చకు దారి తీసిందో తెలిసిందే. ఫ్రాంక్ వీడియోల పేరుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ కరాటే కళ్యాణి అతడిని చితకబాదింది. అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ గొడవ పోలీస్ స్టేషన్ కి చేరింది. ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ రెడ్డితో పాటు కరాటే కళ్యాణిపై కేసులు నమోదయ్యాయి. పిర్యాదు చేయడానికి వచ్చిన నామీద కేసు పెట్టడం ఏమిటని ఆమె మండిపడ్డారు.
ఈ వివాదం నడుస్తుండగానే ఓ పాప దత్తత విషయమై కరాటే కళ్యాణి చట్టపరమైన సమస్యల్లో చిక్కుకున్నారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంటిని సోదా చేశారు. ఈ క్రమంలో కరాటే కళ్యాణి పత్రికా ముఖంగా వివరణ ఇచ్చారు. పాప తల్లిదంద్రులతో పాటు ప్రెస్ మీట్ నిర్వహించిన కరాటే కళ్యాణి... పాపను దత్తత తీసుకోలేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఫ్రాంక్ వీడియోల పేరుతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సుమారు ఇరవై యూట్యూబ్ ఛానెళ్లపై సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు కళ్యాణి ఫిర్యాదు చేయగా.. ఐటీ యాక్ట్‌లోని 67A, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై నిఘా పెట్టడంతో పాటు కేసు విచారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. త్వరలోనే సదరు యూట్యూబ్ ఛానెళ్లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇక గత ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ తరపున జాయింట్ సెక్రటరీగా పోటీ చేసి కరాటే కళ్యాణి ఓడిపోయారు. అయితే నరేష్ అధ్యక్షుడిగా గెలిచినప్పుడు ఆమె గెలవడం జరిగింది. నటిగా సక్సెస్ కాకున్నా వివాదాలు ఆమెకు పరిపాటిగా మారిపోయాయి.