
కరోనా విలయతాండవం చేస్తుంది. సెకండ్ వేవ్ ఊహించిన విధంగా విజృంభిస్తుంది. ఈ సారి సెలబ్రిటీలు ఎక్కువగా కరోనాకి గురవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా పరిశ్రమ ఏదైనా సినీ ప్రముఖులు కరోనాతో బాధపడుతున్నారు. తాజాగా తమిళ నటుడు, దర్శకుడు సుందర్ సి కి కరోనా సోకింది. ఆయనకు కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిందని ఆయన భార్య, సీనియర్ నటి ఖుష్బు సుందర్ వెల్లడించారు. ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.
`నా భర్త సుందర్ సికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ ముందు జాగ్రత కోసం ఆసుపత్రిలో చేరారు. ఆయన్ని కలిసిన వారంతా ఐసోలేట్ కావాలని, వెంటనే టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాం. అలాగే సుందర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని కోరుకుంటున్నా` అని తెలిపింది ఖుష్బు. దీంతో పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ సుందర్ త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు. హర్రర్,థ్రిల్లర్ చిత్రాలకే కేరాఫ్‌గా నిలుస్తున్నారు సుందర్ సి. ఇటీవల విశాల్‌తో `యాక్షన్` చిత్రాన్నిరూపొందించారు. అలాగే `అరన్మనై` సిరీస్ చిత్రాలను రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నారు. నటుడిగానూ ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.