
చిరంజీవి-రామ్ చరణ్ (Ram Charan)నటిస్తున్న పూర్తి స్థాయి మల్టీస్టారర్ ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆచార్య ట్రైలర్ అంచనాలు మరింత పెంచేసింది. తండ్రీ కొడుకులు నువ్వా నేనా అన్నట్లు ట్రైలర్ లో పోటీపడ్డారు. ఇక సిల్వర్ స్క్రీన్ పై ఈ జోడీని చూడడం కన్నుల పండగే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కాగా ఆచార్య విడుదలకు ఓ వారం సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక (Acharya Prerelease Event) ప్లాన్ చేశారు.
హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ నందు ఏప్రిల్ 23 సాయంత్రం 6 గంటల నుండి ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈమేరకు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. ఇక ఆచార్య ప్రీరెలీసీ ఈవెంట్ కి గెస్ట్ ఎవరనే సందిగ్ధత కొనసాగుతుంది. కొద్దిరోజుల క్రితం ఈ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లో జరగనుందని, సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ప్రచారం జరిగింది. తర్వాత చిరంజీవి (Chiranjeevi)తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆచార్య ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి.
పవన్ (Pawan Kalyan)ముందుగా అనుకున్న కొన్ని పొలిటికల్ ఈవెంట్స్ కారణంగా ఇది సాధ్యం కాలేదని ఇండస్ట్రీ టాక్. తాజాగా సూపర్ స్టార్ మహేష్ (Mahesh babu)పేరు తెరపైకి వచ్చింది. ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ మహేష్ ఆచార్య ఈవెంట్ కి రానున్నారంటూ ప్రచారమవుతోంది. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి అతిధిగా హాజరైన విషయం తెలిసిందే. అలాగే చరణ్ కి మహేష్ మంచి మిత్రుడు. కాబట్టి ఈ పుకార్లను కొట్టిపారేయలేం.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్య మూవీలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.