ఆచారి అమెరికా యాత్ర.. మూవీ రివ్యూ

First Published 27, Apr 2018, 2:46 PM IST
Highlights

ఆచారితో యాత్ర... మహా బోర్ గురు

గాయత్రి, లక్కున్నోడు చిత్రాలతో పరాజయాలు మూటగట్టుకున్న మంచు విష్ణు. తనకు గతంలో దేనికైనా రెడీ అంటు హిట్ ఇచ్చిన జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాను కూడ తనదైన శైలిలో నవ్వులు పలకించారు.ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!  

కథ: 
ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అమెరికా నుండి ఇండియా వచ్చిన రేణుక (ప్రగ్య జైస్వాల్)ను ఆమె ఇంటికి హోమం చేయించడానికి వచ్చిన పూజారి కృష్ణమాచారి (మంచు విష్ణు) ప్రేమిస్తాడు. ఆమె కూడ అతన్ని ప్రేమిస్తుంది. వారిద్దరూ ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరచుకునే సమయానికి రేణుక చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళిపోతుంది.ఆమె కోసం కృష్ణమాచారి తన గురువు అప్పలాచారి(బ్రహ్మానందం)కి మాయ మాటలు చెప్పి అందరినీ అమెరికా తీసుకెళతాడు. అక్కడ తన ప్రేమను దక్కించుకోవడం కోసం కృష్ణమాచారి ఏం చేశాడు, అతని వలన అప్పలాచారి ఎలాంటి ఇబ్బందులుపడ్డాడు, అసలు కృష్ణమాచారి, రేణుకల ప్రేమకు అడ్డుపడింది ఎవరు అనేదే ఈ సినిమా.


విశ్లేషణ: 

మంచు విష్ణు సినిమాల్లో విజయవంతమైన ‘ఢీ’.. ‘దూసుకెళ్తా’.. ‘దేనికైనా రెడీ’.. ‘ఈడోరకం ఆడోరకం’ కామెడీ ప్రధాన చిత్రాలు. వాటికి వినోదమే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీటిలో తొలి మూడు సినిమాల్లో బ్రహ్మానందం కీలక పాత్రలు చేశాడు. మంచు విష్ణుతో ఆయన కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరూ కలిసి ప్రేక్షకుల్ని బాగానే నవ్వించారు. ఇక పై నాలుగు సినిమాల్లో చివరి రెండూ తీసిన నాగేశ్వరరెడ్డికి కామెడీ డీల్ చేయడంలో సిద్ధహస్థుడిగా పేరుంది. ఈ ముగ్గురూ కలిసి చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చెప్పుకున్నారు. ఈ టైటిల్.. దీని ప్రోమోలు చూసినా కూడా ఇది మినిమం గ్యారెంటీ వినోదాన్ని అందిస్తుందన్న భరోసా కలిగింది. కానీ రెండు గంటలా 15 నిమిషాల నిడివిలో ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునే నిఖార్సయిన కామెడీ సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇందులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కామెడీ పేరుతో చేసిన ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు.

 ‘ఆచారి అమెరికా యాత్ర’ ద్వితీయార్దంలో హీరో హీరోయిన్లు.. మిగతా బ్యాచ్ అంతా కలిసి అమెరికాలో రైల్లో ప్రయాణిస్తుంటుంది. వాళ్లను పృథ్వీ తన ఫ్యామిలీతో కలిసి కలుస్తాడు. ఎక్కడికెళ్తున్నారు అంటే తన తండ్రి ఫొటో బయటికి తీసి ఆయన స్టోరీ చెప్పి అక్కడున్న వాళ్లందరినీ బాగా విసిగిస్తాడు. అతను ఆ కథ చెప్పే తీరు భరించలేక అక్కడున్నవాళ్లందరికీ పారిపోవాలని అనిపిస్తుంది. ఆ సమయానికి ‘ఆచారి అమెరికా యాత్ర’ చూస్తున్న ప్రేక్షకుల పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆరంభం నుంచి ఏదో ఉంటుంది.. ఎక్కడోచోట నవ్విస్తారు.. కామెడీ పండుతుందని ఎదురు చూసి చూసి విసుగెత్తిపోతాం అప్పటికే. పృథ్వీ చెప్పే స్టోరీ తెరమీద ఉన్న పాత్రలే భరించలేకపోతుంటే.. దాన్నుంచి అద్భుతమైన కామెడీ పండిపోతున్నట్లుగా అదే కథను ఒకటికి మూడుసార్లు చెప్పిస్తారు. ఇక ప్రేక్షకుడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేదేముంది?

మంచి టైటిల్.. ఆకర్షణీయమైన పోస్టర్ ఉన్నంతమాత్రాన అందులో విషయం ఉంటుందని ఆశించడం తప్పవుతుందని ‘ఆచారి అమెరికా యాత్ర’ అడుగడుగునా రుజువు చేస్తుంది. ఈ చిత్రానికి అసలు అమెరికా నేపథ్యాన్ని ఎందుకు ఎంచుకున్నారన్నదే అర్థం కాదు. దాని వల్ల సినిమాకు ఏ ప్రత్యేకతా చేకూరలేదు. ఇది పేరుకు మాత్రమే ఆకర్షణ. అమెరికా నేపథ్యంలో నడిచే కథ.. సన్నివేశాలు చాలా పేలవంగా తయారయ్యాయి. హీరో తన గురువుకు అబద్ధం చెప్పి.. అరచేతిలో స్వర్గం చూపించి.. అమెరికాకు తీసుకొస్తాడు. కానీ అక్కడికెళ్తే వ్యవహారం మరోలా ఉంటుంది. నిజానికి వాళ్ల పాట్ల నేపథ్యంలో కామెడీ పండించడానికి మంచి స్కోపే దొరికింది. ఐతే మంచి సందర్భం దొరికితే చక్కగా కామెడీ పండించే నాగేశ్వరరెడ్డి క్లూ లెస్ గా కనిపించాడు. పేలవమైన సన్నివేశాలతో ఆరంభంలోనే బోర్ కొట్టించేశాడు. ఇక మధ్యలో కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఇండియా నేపథ్యంలో సాగుతుంది. అక్కడ కూడా చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. హీరోయిన్ని హీరో బట్టల్లేకుండా చూడటం.. ఆ నేపథ్యంలో వచ్చే సీన్లు చూస్తున్నపుడు 90ల రోజుల్లోకి వెళ్లిపోతాం. ఈ కాలం చెల్లిన రొమాంటిక్ ట్రాక్ ఓవైపు.. ఏమాత్రం కామెడీ పండని బ్రహ్మానందం ట్రాక్ మరోవైపు.. రెండూ విసిగించేస్తాయి. కానీ సినిమాలో మిగతా ఎపిసోడ్ల కంటే ఇదే కాస్తంత నయంగా అనిపిస్తుంది.

కేవలం తన తాత అస్థికల్ని దక్కించుకుని కాశీలో కలపడం కోసం హీరోయిన్ విలన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఈ విషయమై సినిమాలో ఎంత వివరణ ఇచ్చినప్పటికీ దాని చుట్టూ మొత్తం ద్వితీయార్ధాన్ని నడపడం అన్నది విడ్డూరమైన విషయం. ద్వితీయార్ధంలో అసలు కథేంటో అర్థమైపోయాక ఇక ముగింపు కోసం ఎదురు చూడటమే మిగులుతుంది. నాగేశ్వరరెడ్డి నిలకడ తప్పకుండా ఒకే లెవెల్లో.. పేలవమైన సన్నివేశాలతో బండి నడిపించడంతో ద్వితీయార్ధం మరింత భారంగా తయారవుతుంది. పతాక సన్నివేశాల గురించి చెప్పడానికి ఏమీ లేదు. కథాకథనాల్లో విషయం లేనపుడు ఎలాంటి కాంబినేషన్ అయితే ఏముంది? గతంలో ఈ కాంబినేషన్లో ఎలాంటి సినిమాలొస్తే ఏముంది?  మిగతా విషయాలన్నీ పక్కన పెడితే కనీసం ఈ కాంబో నుంచి ఆశించే మినిమం కామెడీ సినిమాలో లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. 

సాంకేతిక విభాగం :

దర్శకుడు నాగేశ్వర్ రెడ్డిగారు ‘ఆచారి అమెరికా యాత్ర’ పేరుతో చేసిన నవ్వించే ప్రయత్నం ఫలించలేదు. బహీనమైన కథ, కథనం, కొత్తగా అనిపించే కామెడీ ట్రాక్స్ రాసుకోకపోవడం, కమెడియన్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం వంటి తప్పిదాల వలన సినిమాను ఆకట్టుకునే విధంగా తయారుచేయలేకపోయారాయన.

రచయిత మల్లాది వెంకటకృష్ణ మూర్తిగారు సినిమాని నిలబెట్టే స్థాయి రచనను ఇవ్వలేకపోయారు. సంగీత దర్శకుడు తమన్ పెద్దగా గుర్తుండిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ, పాటల సంగీతాన్ని కానీ ఇవ్వలేదు. సిద్దార్థ రామస్వామి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. వర్మ ఎడిటింగ్ ద్వారా ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలను తొలగించాల్సింది. కీర్తి చౌదరి, కిట్టులు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు:

పాత తరహా కామెడీ ఫార్ములానే నమ్ముకుని వచ్చిన ఈ ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అందించదు. తాత, మనవరాళ్లు ఎమోషనల్ ట్రాక్, బ్రహ్మానందం కామెడీ మినహా అదే పాత, బలహీనమైన కథా కథనాలు, కొద్దిగా కూడ ఆకట్టుకోలేకపోయిన సెకండాఫ్, ఎక్కడా కూడ పెద్దగా నవ్వించలేకపోయిన కమెడియన్ల పెర్ఫార్మెన్స్ వంటి బలహీనతలు కలిసి సినిమాను బోర్ కొట్టించేలా తయారుచేశాయి. మొత్తం మీద హాస్యభరితమైన సినిమాల్ని, బ్రహ్మానందం కామెడీని కోరుకునే వారికి ఈ చిత్రం కొంత పర్వాలేదనిపిస్తుంది కానీ కొత్తదాన్ని ఆశించేవారిని అస్సలు మెప్పించదు.
చివరగా : ఆచారితో యాత్ర... మహా బోర్ గురు
రేటింగ్   :  1.5/4

Last Updated 27, Apr 2018, 7:26 PM IST