
అప్పుడే పుట్టిన పసిపాపను మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగే ఆనందాశ్చర్యాల పరవశపు పులకింత.. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని కొద్దికొద్దిగా వేళ్లకు అంటుకున్నదాన్ని ఆస్వాదిస్తూ తినేప్పుడు కలిగే ప్రశాంతమైన అనుభూతి.. పండు వెన్నెల కురిసే నిండు పున్నమి వేళ కేవలం ఆకాశం మాత్రమే కనిపించేలా తలెత్తి చూస్తూ....బయట వినిపించే రణగొణ ధ్వనులను మరిచిపోయి.. ఆ చంద్రుడి చుట్టూ పరుచుకున్న వెన్నెలకోసం పోటీపడే మేఘాలను.. చంద్రుడిని, వెన్నెలను కమ్మేస్తూ.. తిరిగి విడిపిస్తూ.. పూర్తిగా తమలో కలుపుకోలేకపోయామే అనేలా భారంగా కదిలే మేఘాల పయనాన్ని ఒంటరిగా ఆస్వాదించడంలోని ఆనందం... వీటిని అనుభూతి చెందారా?
అరటి ఆకులోని సున్నితత్వాన్ని.. మనసు పొరల్లో మనవైన ఒంటరి ఫీలింగ్స్ లోని ఆర్తిని.. మంచుకొండల్లోని తెల్లటి, అందమైన పాలనురగలాంటి మంచుకు ఆశ్రయమిచ్చే కొండ గరుకుదనాన్ని.. అన్నింటినీ ఒక దగ్గర చేర్చే నేర్పు, ఓర్పు ఎక్కడైనా చూశారా... కాస్త ఓవర్ గా అనిపిస్తుందా.. వర్ణన.. బట్ ఇది నాకు ఆ సినిమా చూసిన తరువాత కలిగిన నిజమైన ఫీలింగ్. ఆ డైరెక్టర్ మీద కలిగిన అభిమానం..ఆరాధన.. వాటెవర్ ఇట్ మేబీ.. ఇంత సున్నితమైన డైరెక్టర్ మనకు ఉండడం నిజంగా అద్భుతం..
ముందు ఆ సినిమా పేరు చెబుతాను.. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. ఈ సినిమా డైరెక్టర్ ఇంద్రగంటి మోహనక్రిష్ణ. ఈ సినిమా హిట్టా, ఫట్టా నాకు తెలియదు. నేరు రివ్యూలు చదవలేదు. ఎప్పుడు రిలీజయ్యిందో చూడలేదు.. బట్ అమెజాన్ లో ఉండడం వల్ల.. ఈ సినిమా గురించి విని ఉండడం వల్ల చూశాను. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా.. ఓటీటీల్లో వచ్చే సినిమాలను అందరూ చూసేలాగే.. టైంపాస్ కోసమే చూశాను. అందరూ ఏమో కానీ నేను మాత్రం..మరీ చికాకుగా ఉన్న సమయంలో తెలుగు సినిమాల్ని సబ్ టైటిల్స్ చదివి అర్థం చేసుకోకుండా ఉండడానికి, మెదడుకు పనిచెప్పకుండా ఉండడానికి చూస్తాను. అలాగే ఈ సినిమానూ మొదలుపెట్టాను.
నిజానికి అంతకు ముందు ఈ సినిమా గురించి విన్నాకూడా.. టైటిల్స్ పడేవరకు డైరెక్టర్ ఇంద్రగంటి అనికానీ, హీరోయిన్ కృతీశెట్టి అనిగానీ.. హీరో సుధీర్ బాబు.. అని కానీ గుర్తు రాలేదు. ఇంద్రగంటి పేరు చూడగానే.. ఓకే మంచి సినిమానే.. పావుగంటలో మరో సినిమా వెతుక్కోనక్కరలేదు అనుకున్నా.. అనుకున్నట్టుగానే.. రెండున్నర గంటల సినిమా ఓ రోలర్ కోస్టర్ రైడ్..ఎప్పుడైపోయిందో తెలియలేదు. సినిమా అయ్యాక.. ఆ ఎమోషన్స్ తాలూకు హాంగోవర్ తగ్గలేదు.
ఓ పక్కా కమర్షియల్ డైరెక్టర్..ఆయన తీసే పిచ్చి మాస్ సినిమాలు..సినిమాలంటేనే పడని అమ్మాయి.. రొటీన్ స్టోరీ లైన్. కానీ దాన్ని చెప్పిన విధానం.. టేకింగ్, అందులో ఏ టైంలో, ఏ మలుపులో ఎలాంటి ఎమోషన్ కలపాలో.. ఎలా ప్రేక్షకుడిని కనెక్ట్ చేయాలో.. వారి మనసులోకి సూటిగా సూదిలా గుచ్చి నెమ్మదిగా ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలో తెలిసిన డైరెక్టర్ ఇంద్రగంటి.. అందుకే ఈ సినిమా చూడగానే డ్రగ్స్ తీసుకున్నట్టు సినిమా మత్తు తలకెక్కదు. నెమ్మదిగా మనలోకి మనం తొంగి చూసుకుని కాసేపు ఆలోచించేలా చేస్తుంది. ఓ మంచి మెడిసిన్ లాగా.
ఇక కథల విషయానికి వస్తే.. పాన్ ఇండియా డైరెక్టర్లే కథల గురించి తలలు బద్దలు కొట్టుకుంటుంటే.. ఈయన మాత్రం కూల్ గా తన చుట్టూ ఉన్న జీవితాల్నే.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని కథల్నే తన కథలుగా ఎంచుకుని.. వాటికి తనదైన మార్కుతో తెరకెక్కించడం.. నిజంగా హాట్యాఫ్. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అదే ఆయన నమ్ముతారేమో. వెతికితే సినిమా ఇండస్ట్రీలో దొరికేన్ని కథలు ఇంకెక్కడా ఉండవు...ఆ సూత్రాన్ని బాగా పట్టుకున్నారాయన..
నిజానికి సుధీర్ బాబు మొహంలో ఎక్స్ ప్రెషన్స్ పలకవు అనే టాక్ విన్నా.. ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమా చూసినప్పుడు నాకు ఆ ఫీలింగే కలిగింది. కానీ అదేంటో ఇంద్రగంటి సినిమాల్లో సుధీర్ బాబు మనకు సుధీర్ బాబులా కనిపించడు.. ఆయనలోని నటుడు ఆ పాత్రలో పురుడు పోసుకుంటాడు. ఇక కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు... వీరిద్దరే కాదు.. ప్రతీ ఒక్క క్యారెక్టర్.. నిజంగా రోజూ మనం మనింట్లోనో, పక్కింట్లోనో మన ఆఫీసులోనే చూసేలాగే ఉంటాయి. కొంచెం ఎక్కువా, కొంచెం తక్కువా.. ఎక్కడా కనిపించదు. అతిశయం ఉండదు. ఆర్భాటం ఉండదు. అలా స్మూత్ గా సాగిపోయి.. దిఎండ్ కార్డ్ పడిపోతుంది.
ఆ తరువాతే అసలు కథ గురించి మళ్లీ మొదటి నుంచి ఆలోచిస్తాం. కథ ఎలా మొదలయ్యింది. అందులోకి మనల్ని ఎలా లాక్కెళ్లింది. అరే.. భలే తీశాడే.. ఈ కాలంలో ఇలా కూడా ఇంత సున్నితంగా, ఎమోషనల్ గా, నవరసాలూ పండించేలా సినిమా తీయొచ్చా.. అందులోనూ తానుంటున్న ఇండస్ట్రీలో జరిగే చెడును చెంపపెట్టులా కొట్టే కొన్ని సీన్స్ ను అంత ధైర్యంగా ఎలా తీయగలిగాడు. అసలు ఆయన గట్స్ ఏంటీ.. మౌనమునిలా కనిపించే ఇంద్రగంటిలో లోపల ఇంత గట్టిపిండం ఉన్నాడా? అన్నీ.. ఒక్కోసీన్ మళ్లీ రీకాల్ చేసుకుంటూ వెడతాం... ఒక్క సినమాలోనే కాదు.. ఒక్కో యాక్టర్ లో నవరసాలూ పిండేస్తాడు.. హ్యాట్సాప్ డైరెక్టర్..
పీఎస్ : ఈ సినిమాను ఒక్కరే ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా ఆసాంతం ఒక్క స్ట్రెచ్ లో చూడండి. మీరూ నాలాగే ఫీలవుతారనుకుంటా.. నేనైతే ఆ డైరెక్టర్ తో ప్రేమలో పడిపోయా.. అన్నట్టు.. ఆయన్ని ఒకసారి బుక్ ఫెస్టివల్ లో కలిసినప్పుడు మాట్లాడా కానీ.. అప్పటికింకా సమ్మోహనం సినిమా రాలేదు. ఈ సారి కలిస్తే మాత్రం.. ఏమీ మాట్లాడను.. అలా చూస్తానంతే..
- సుమబాల