
కర్ణాటకలోని బీదర్ జల్‌సంగీకి చెందిన బిజినెస్‌మేన్ రుస్తుంపటేల్(42). హైదరాబాద్ ఓల్డ్ సిటీ యాఖుత్‌పురా దారాబ్‌జంగ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. పటేల్ ఫ్యామిలీ గతంలో చిన్నగోల్కొండలో ఉండేవారు. ఆ టైంలో బీదర్‌కు చెందిన తన స్నేహితుడైన ఆజం ద్వారా రాజేంద్రనగర్ చింతల్‌లోని గోల్డెన్‌కాలనీకి చెందిన ఫర్నీచర్ వ్యాపారంతోపాటు బ్లాక్‌మ్యాజిక్ చేస్తానని చెప్పే మెహతాబ్ హుస్సేన్(40)తో పరిచయమైంది. ఈ క్రమంలో ఆదిల్ చూపు రుస్తుం పటేల్ సంపద మీద పడింది. అంతే.. ఎలాగైనా అతని డబ్బు కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గర రైస్‌పులింగ్ మంత్ర పాత్ర ఉందని.. దాని ఒక పార్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రూ.2500 కోట్ల విలువ చేస్తుందన్నాడు… జలసంగీలో తవ్వకాలు చేస్తే బంగారు గనులు దక్కుతాయని చెప్పి అతడి నుంచి రూ.8లక్షలు తీసుకొని తవ్వకాలు జరిపించాడు. ఏమీ దొరక్కపోవడంతో నీవు మంచి మనస్సుతో కార్యం తలపెట్టలేదని చెప్పి తప్పించుకున్నాడు. ఇలా పలు విధాలుగా రుస్తుంపటేల్ని నమ్మిస్తూ రూ.5కోట్ల వరకు దండుకున్నారు ఆదిల్ అతని భార్య షకీనా ఫాతిమా(36).
ఇక వ్యవహారాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి పూర్వజన్మలో నువ్వు మైసూర్ రాజువని, నీకోసం రాజకన్య 4వేల ఏళ్ల నుంచి ఎదురుచూస్తుందని మగధీర కథని రీమిక్స్ చేసి పటేల్ కు వినిపించాడు. ఆమెను నీకు దక్కెలా చేస్తానని ఓ అమ్మాయి ఫొటోలు, ఆమె రాసిందంటూ హిందీలో ఉన్న లేఖలను చూపించారు. ఆదిల్ కు ఆయన భార్య షకీనా ఫాతిమాకూడా తోడై కథను రక్తికట్టించింది. ఇదంతా మోసమని చివరికి గ్రహించిన రుస్తుం పటేల్ తన సొమ్ములు తిరిగి ఇవ్వాలని కోరగా ఆదిల్ తుపాకీతో బెదిరించాడు. అంతేకాదు రుస్తుంపటేల్ తన జోలికి రాకుండా చూడాలని మల్లెపల్లికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ యూసఫ్(44) అలియాస్ జంగ్లీయూసఫ్‌కు రూ.8.5 లక్షలు ఇచ్చాడు. దీంతో రౌడీషీటర్ కూడా బాధితుడిన్ని బెదిరించడం మొదలు పెట్టాడు. ప్రాణభయంతో రుస్తుంపటేల్ మీర్‌చౌక్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మగథీర రీమిక్స్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల దగ్గర్నుంచి రూ.13.50 లక్షల నగదు, బ్లాక్‌మ్యాజిక్‌కు ఉపయోగించే సామగ్రిని, ఎయిర్‌ఫిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్వాపరాలను పురానిహవేలీలోని పోలీస్ కమిషనరేట్ లో దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.